epaper
Monday, January 19, 2026
spot_img
epaper

సీఎం, మంత్రుల మధ్య పంపకాల్లో తేడాలు : ప్రశాంత్​ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఎద్దేవా చేశారు. సివిల్ సప్లైస్, లిక్కర్, బొగ్గు కుంభకోణాల్లో మంత్రులు, సీఎం వాటాల కోసం కొట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన బీ ఆర్ ఎస్ కార్యకర్తల మున్సిపల్ సన్నాహక సమావేశంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టుకొని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను తాకే నైతిక అర్హత లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

గత రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ తెలంగాణ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనడానికి డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని, ఆయన ఒక తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో నడిచే రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు అడ్డు పడ్డాడు కాబట్టే తెలంగాణా ప్రజలు తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుండి ఆంధ్రకు పంపించారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

ముఖ్యంగా మహిళలకు, వృద్దులకు ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీల వీడియోలను ప్రతి ఇంటికి వెళ్లి చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. బోధన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని  Prashanth Reddy ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, గిర్దావర్ గంగారెడ్డి, నర్సింగ్ రావు మాజీ జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు ఎంపిటిసిలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>