కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే పురపొరులోనూ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికకు పార్టీ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్ కు ఇన్ చార్జ్ మంత్రి చైర్మన్ గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్ లుగా, పార్లమెంట్ నియోజక వర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో కమిటీలు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీలదే కీలక పాత్ర అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా మన్సిపల్ ఎన్నికలు (Municipal Elections) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కూడా కావడంతో.. రాష్ట్ర కేబినెట్ ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తి చేయడానికి షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు సూచించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ చార్జ్ లను కూడా నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read Also : మేడారంలో జియోట్యాగింగ్ సేవలు
Follow Us On : Twitter


