కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం (Medaram) సమ్మక్క–సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా గుర్తింపు పొందిన ఈ మహాజాతర ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
12వ శతాబ్దపు యథార్థ గాథ
12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించిన ఆదివాసీ దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను, మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న సంతానం. కాకతీయులకు కప్పం చెల్లించలేదన్న కారణంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తడంతో మేడరాజు మేడారానికి చేరి అజ్ఞాతవాసం గడిపాడు. కరువు కారణంగా కప్పం చెల్లించలేకపోయిన పగిడిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారం (Medaram)పై దాడి చేశాడు.
వీరోచిత పోరాటం
సాంప్రదాయ ఆయుధాలతో సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు వీరోచితంగా పోరాడారు. అయితే అపార కాకతీయ సేనల ఎదుట పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ వార్తతో జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచే అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. చివరికి సమ్మక్క కూడా యుద్ధభూమి నుంచి చిలుకల గుట్ట వైపు వెళ్లుతూ అదృశ్యమైంది. ఆమె జాడ కోసం వెతికిన అనుచరులకు పుట్ట వద్ద పసుపు, కుంకుమలతో కూడిన భరణ లభించింది. దానినే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి జాతర నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజుల జాతర
జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును ప్రతిష్ఠిస్తారు. 29న చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠ చేస్తారు. మూడో రోజు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగో రోజు సాయంత్రం అమ్మవార్లను తిరిగి వన ప్రవేశం చేయిస్తారు. వంశపారంపర్యంగా ఆదివాసులే పూజార్లుగా వ్యవహరిస్తూ, జాతరను పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణ. భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లను వేడుకుంటారు.
Read Also: యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
Follow Us On: X(Twitter)


