కలం, వెబ్ డెస్క్: ఇటీవల ఇండిగోలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు నరకం అనుభవించారు. కొన్ని విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఈ సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. నాలుగు సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరిపి పలు కీలక అంశాలను తేల్చింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీజీసీఏ చర్యలు తీసుకున్నది. 2025 డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకున్న విమాన ఆలస్యాలు, రద్దుల వ్యవహారంలో ఇండిగో నిబంధనలు ఉల్లంఘించినట్టు కమిటీ తేల్చింది. దీంతో డీజీసీఏ, ఇండిగోపై ₹22.20 కోట్ల జరిమానా విధించింది. అదనంగా, భవిష్యత్‌లో వ్యవస్థాగత సంస్కరణలు అమలుకు హామీగా ₹50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది.
విడతల వారీగా గ్యారెంటీ
ఈ బ్యాంక్ గ్యారంటీని ‘ఇండిగో సిస్టమిక్ రీఫార్మ్ అష్యూరెన్స్ స్కీమ్ (ISRAS)’ పేరుతో అమలు చేస్తారు. సంస్కరణలు అమలైన దశల మేరకు డీజీసీఏ ధృవీకరణ అనంతరం గ్యారంటీని విడతలవారీగా విడుదల చేస్తారు. లీడర్‌షిప్, గవర్నెన్స్, మానవ వనరుల ప్రణాళిక, రోస్టరింగ్, ఫటిగ్ రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటల్ సిస్టమ్స్, ఆపరేషనల్ రిజిలియెన్స్, బోర్డు స్థాయి పర్యవేక్షణ వంటి నాలుగు కీలక అంశాల్లో సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది.
ఆలస్యాలు రద్దులకు కారణాలివే..
డిసెంబర్ 3 నుంచి 5 మధ్య కాలంలో ఇండిగోలో 2,507 ఫ్లైట్లు రద్దు, 1,852 ఫ్లైట్లు ఆలస్యం కావడంతో మూడు లక్షల మందికిపైగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ (DGCA) ఆదేశాలతో నలుగురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. విచారణలో అతిగా ఆపరేషన్ల ఆప్టిమైజేషన్, సరైన నియంత్రణా లేకపోవడం, సాఫ్ట్‌వేర్ లోపాలు, మేనేజ్‌మెంట్ పర్యవేక్షణ ప్రధాన కారణాలుగా తేలాయి. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను సమర్థంగా అమలు చేయకపోవడం, రోస్టర్ బఫర్ మార్జిన్లు తగ్గిపోవడం, సిబ్బందిపై అధిక భారం పడటం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టమైందని కమిటీ పేర్కొంది.
జరిమానాల వివరాలు
నిబంధనల ఉల్లంఘనలపై డీజీసీఏ ఒకేసారి రూ. 1.80 కోట్ల సిస్టమిక్ జరిమానా విధించింది. అలాగే సవరించిన FDTL నిబంధనలను 68 రోజుల పాటు పాటించకపోవడంపై రోజుకు ₹30 లక్షల చొప్పున 20.40 కోట్ల జరిమానా విధించింది. దీంతో మొత్తం జరిమానా ₹22.20 కోట్లకు చేరింది. ఇండిగో సీఈఓకు హెచ్చరిక జారీ చేసింది. అకౌంటబుల్ మేనేజర్ (సీఓఓ)కు వింటర్ షెడ్యూల్, సవరించిన FDTL ప్రభావాన్ని అంచనా వేయడంలో వైఫల్యంపై వార్నింగ్ ఇచ్చింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫ్లైట్ ఆపరేషన్స్)ను ఆపరేషనల్ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించింది. అదనంగా డిప్యూటీ హెడ్–ఫ్లైట్ ఆపరేషన్స్, ఏవీపీ–క్రూ రిసోర్స్ ప్లానింగ్, డైరెక్టర్–ఫ్లైట్ ఆపరేషన్స్‌లకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండిగో అంతర్గత విచారణలో బాధ్యులుగా తేలిన ఇతర సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుని డీజీసీఏకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. డీజీసీఏ భద్రత, నియంత్రణా అనుసరణే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ, పౌర విమానయాన రంగంలో స్థిరమైన ఆపరేషన్లు, ప్రయాణికుల భద్రత, సిబ్బంది సంక్షేమం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.


