కలం, నల్లగొండ బ్యూరో: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా భవాని శంకర్ నియమితులయ్యారు. ఇంతకుముందు యాదగిరిగుట్ట ఈవోగా పని చేసిన వెంకట్రావు ఇటీవల వ్యక్తిగత ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారు. దీంతో అప్పటినుంచి ఆలయ ఈవో పోస్టు ఖాళీగా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆలయ ఈవోగా భవాని శంకరును నియమించారు.
ప్రస్తుతం భవాని శంకర్ తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిజానికి వెంకట్రావు రాజీనామా తర్వాత యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయ ఈవోగా భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కరరావు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది.
అయితే అప్పటికే ఒకసారి భాస్కర్ రావు ఈఓగా పని చేశారు. మొదట యాదాద్రి అదనపు కలెక్టర్ గా పని చేసిన భాస్కరరావు, తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా పనిచేశారు. అనంతరం మళ్లీ భువనగిరి అదనపు కలెక్టర్ గా భాస్కర్ రావు నియమితులయ్యారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ ఈవో పోస్ట్ వ్యవహారంలో కొంత వివాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఈవోగా భాస్కరరావు నియామకమైతే మరింత గందరగోళం ఏర్పడుతుందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తాజాగా ఆలయ ఈవోగా భవాని శంకర్ నియమితులు కావడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు అయింది.


