కలం, వెడ్ డెస్క్: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే, కాంగ్రెస్ పార్టీల(DMK – Congress) మధ్య డీల్ ఓకే అయ్యింది. ఈ మేరకు సీఎం స్టాలిన్, కాంగ్రెస్ టీఎన్ పీసీసీ ధ్యక్షుడు కె.సెల్వపెరుతగై సమక్షంలో రెండు పార్టీల అగ్ర నాయకుల మధ్య బుధవారం జరిగిన రెండో విడత చర్చలు ఫలించాయి. ఒప్పందం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒకటి కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది. అనంతరం ఇరు పార్టీ నాయకుల సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివలయంలో జరిగిన ఈ భేటీలో డీఎంకే నాయకులు, ఎంపీ కనిమొళితోపాటు (DMK – Congress) కాంగ్రెస్ నాయకులు గిరిష్ చోదంకర్, రాజేశ్ కుమార్, నివేదిత్ ఆల్వా తదితరులు ఉన్నారు. ఈ డీల్‌ను డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(ఎస్పీఏ) కూటమి విజయానికి మొదటి అడుగుగా నేతలు అభివర్ణించారు. డీఎంకే, పీఎంకే, వీసీకే, కాంగ్రెస్‌తో కూడిన ఎస్పీఏ కూటమి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇందులో డీఎంకే 133, కాంగ్రెస్ 18, పీఎంకే 5, వీసీకే 4 సీట్లు గెలిచాయి.
234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే కూటమి ‘ద్రవిడియన్ మోడల్ 2.0’ పేరుతో రెండో దఫా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి, నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీలు కూడా బరిలో ఉన్నాయి.

