హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిపై ఓ వ్యక్తి చేసిన అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏమైందో ఏమో కానీ.. యువతిని చిత్ర హింసలకు గురిచేశాడా వ్యక్తం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటకు చెందిన భాను ప్రకాష్(23) అనే యువకుడు ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. సోమాజిగూడకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మబలికాడు. ఇటీవల యువతి ఫ్లాట్‌కు వెళ్లిన భానుప్రకాష్.. ఏదో విషయంలో యువతితో గొడవపడ్డాడు.
Hyderabad | అనంతరం ఆమెను నిర్బంధించాడు. అంతేకాకుండా లైంగిక దాడికి పాల్పడుతుండగా నిరాకరించడంతో, యువతి గోర్లను కత్తెరతో పీకి, గొంతు నులిమి, ప్రైవేట్ భాగాలపై తీవ్రంగా దాడి చేసి, పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా ధైర్యం చేసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు అతడు ఎందుకు దాడి చేశాడు? వారిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

