epaper
Friday, January 16, 2026
spot_img
epaper

దాయాదులు ఒక్కటైనా.. దక్కని ఫలితం!

కలం, తెలంగాణ బ్యూరో:  BMC Results | మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే దాయాదుల బంధం కలిసి రాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాలిపగలను పక్కన పెట్టి, బరిలోకి దిగినా ఫాయిదా లేకుండాపోయింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో వీరితోపాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూటమి గా జతకట్టి పోటీ చేస్తే.. మొత్తం 227 స్థానాలకు గాను దాదాపు 80 సీట్లలోనే లీడ్ లో ఉన్నాయి. రాష్ట్రంలోని అధికార బీజేపీ, శివసేన పార్టీల మహాయుతి కూటమి ముంబై కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇతర కార్పొరేషన్లలోనూ ఉద్దవ్ , రాజ్ కు ఇదే పరిస్థితి ఎదురైంది.

2 దశాబ్దాల వైరాన్ని వీడి.. బరిలోకి దిగినా..!

ఉద్దవ్ థాక్రే (Uddhav Thackeray), రాజ్ థాక్రే (Raj Thackeray) మధ్య రెండు దశాబ్దాల వైరం ఉంది. ఆరు నెలల కిందట.. ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదికి రావడం మరాఠా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్ర స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డర్ కు వ్యతిరేకంగా వీరు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని, మరాఠీ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతర పరిణామాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గి.. హిందీ తప్పనిసరి కాదని ప్రకటించింది. దీన్ని ఇద్దరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావించారు. బీఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలోనూ పోటీ చేశారు. ఉద్దవ్, రాజ్ మధ్య వైరం 2003 నుంచి కొనసాగుతున్నది. దీని వెనుక రాజకీయ నేపథ్యమూ ఉంది.

నాడు అవమానం భారంతో..!

ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే.. పాలోళ్లు (కజిన్స్)! ఉద్దవ్ థాక్రే తండ్రి బాల్ థాక్రే (Bal Thackeray), రాజ్ థాక్రే తండ్రి శ్రీకాంత్ థాక్రే (Srikanth Thackeray) అన్నాదమ్ములు. తన పెద్దనాన్న బాల్ థాక్రే స్థాపించిన శివసేనలో రాజ్ థాక్రే చురకుగా ఉండేవారు. అచ్చం బాల్ థాక్రే లానే ఆయన వ్యవహార శైలి, నడక, ప్రసంగం ఉండేవి. శివసేనలో బాలాసాహెబ్ థాక్రే తర్వాత రాజ్ థాక్రేనే పార్టీ పగ్గాలు చేపడ్తారని అందరూ భావించారు. కానీ.. తన కొడుకు ఉద్దవ్ ను 2003లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాల్ థాక్రే ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్దవ్, రాజ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

2005 డిసెంబర్ లో శివసేనకు రాజీనామా చేసి.. అనంతరం నాలుగు నెలలకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS)ను రాజ్ థాక్రే స్థాపించారు. తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని బహిరంగంగానే శివసేనపై ఆయన నిప్పులు చెరిగారు. అలా 20 ఏండ్లకు పైగా రాజ్, ఉద్దవ్ మధ్య పంచాయితీ కొనసాగింది. అయితే.. గతేడాది జులైలో త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా జరిగిన సభా వేదిక వీరిని కలిపింది. మరాఠీ నినాదంతోనే ఒక్కటిగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లారు. కానీ.. ఫలితం (BMC Results) దక్కలేదు. కీలకమైన బీఎంసీ లోనూ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు.

Read Also: ఇంకెంతకాలం.. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై సుప్రీంకోర్టు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>