కలం, వెబ్ డెస్క్: చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ ముసుగులో ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారని, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు (Salman Murder) ఏం సమాధానం చెప్తారని జగన్ ప్రశ్నించారు. ‘‘అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది? ఈ ఘటన ముమ్మాటికీ వైసీపీని భయపెట్టడానికి, మీ పార్టీద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే’’ అని జగన్ అన్నారు.
‘‘మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైసీపీ (YCP) కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను ప్రోత్సహించారు. పౌరులకు రక్షణ కల్పించడం, స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడటం మీ బాధ్యత కాదా?’’ అని జగన్ ప్రశ్నించారు.
‘‘మీ కక్షల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీ చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది ’’ అని జగన్ (YS Jagan) అన్నారు.
Read Also: ఐదెకరాల భూమి కొన్న కోహ్లీ, అనుష్క కపుల్.. ఎక్కడంటే
Follow Us On: X(Twitter)


