కలం వెబ్ డెస్క్ : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం(Hindupur)లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా వ్యవహరిస్తున్న పలువురు బైక్ రేసర్లను ఓ గ్రామస్థులు పట్టుకొని చితకబాదారు. హిందూపురం మండలంలోని కొల్లకుంట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద బైక్ రేసింగ్ చేస్తూ యువకులు హల్చల్ చేశారు. యువకుల తీరును తప్పుపడుతూ పలువురు గ్రామస్తులు వారిని హెచ్చరించారు. దీంతో యువకులు గ్రామస్తులపైకే తిరగబడ్డారు. మంచి చెప్పినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో మరికొంతమంది గ్రామస్తులు అక్కడ గుమిగూడారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడమే కాకుండా గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించడంతో బైక్ రేసర్లను పట్టుకు దేహశుద్ధి చేశారు.


