కలం, వెబ్ డెస్క్ : హోం శాఖను దగ్గర పెట్టుకుని పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్టీవీ ఆఫీస్ లో పోలీసుల సోదాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను, సోషల్ మీడియా వారియర్స్, జర్నలిస్టుల ఇంటి మీదికి పోలీసులను పంపి అరెస్టు చేయిస్తున్నాడని విమర్శించారు. అల్లు అర్జున్, సహచర మంత్రి కొండా సురేఖ ఇండ్లకు కూడా అర్ధరాత్రి పోలీసులను పంపించాడన్నారు. మహిళా జర్నలిస్టులు అని చూడకుండా రాత్రి 12 తర్వాత రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడని మండిపడ్డారు.
‘నేరగాళ్లని వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం, ప్రశ్నించే గొంతుల మీద పోలీసులను ఉసిగొల్పుతున్నారు. మీడియా గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా?.. అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్టులు చేయడం దుర్మార్గం. సిపి సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలా మాట్లాడుతున్నారు. దళిత జర్నలిస్టుపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చూస్తున్నాడు. జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌ను అడ్డుపెట్టుకుని మీడియా సంస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
నాలుగో స్తంభమైన మీడియాను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పండుగ వేళ జర్నలిస్టులను అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతున్నారు. స్వేచ్ఛను ఇస్తున్నాం అని చెబుతున్న రేవంత్ రెడ్డి.. నియంతలా వ్యవహరిస్తున్నారు. సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి. గతంలో కేటీఆర్‌పై మంత్రి అడ్డగోలు కామెంట్స్ చేసినప్పుడు విచారణ ఎందుకు చేయలేదు. కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులపైన అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తే ఊరుకోము.. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తున్నది’ అని హరీశ్ రావు (Harish Rao) వెల్లడించారు.
Read Also: మున్సి‘పోల్స్’.. రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం
Follow Us On: Sharechat


