కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరం అరుణవర్ణాన్ని పులుముకుంటున్నది. ఈ నెల 18న ఖమ్మంలో సీపీఐ (CPI) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జరగనున్నది. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరాన్ని పార్టీ కార్యకర్తలు ఎరుపెక్కిస్తున్నారు. సభా సమయం దగ్గర పడుతుండడంతో నగరాన్ని ఎర్ర తోరణాలతో అలంకరిస్తున్నారు. ఇల్లందు క్రాస్ రోడ్డు, మయూరిసెంటర్, జెడ్పీ సెంటర్, వ్యవసాయ మార్కెట్ సెంటర్, వరంగల్ క్రాస్ రోడ్డు, చర్చికాంపౌండ్ సెంటర్, ముస్తఫానగర్, బోసుబొమ్మ సెంటర్, కాల్వొడ్డు తదితర కూడళ్లలో ఎర్ర తోరణాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. వైరా రోడ్డు, బైపాస్ రోడ్డులో భారీ ఎత్తున సీపీఐ జెండాలను ఏర్పాటు చేశారు.
నగరంతో పాటు నగరంలో ప్రవేశించే అన్ని రహదారుల్లో సీపీఐ (CPI) నాయకులు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్రను తెలియజేసే విధంగా ఫ్లేక్సీలను ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే సిపిఐ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
పాలకుల నిర్బంధాలలో, ప్రజా పోరాటాలలో మరణించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులను యాది చేసుకోవడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట అమరులను స్మరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే కనిపిస్తున్నాయి.లక్షలాది మంది ప్రజలు హాజరుకానుండడంతో పోలీస్ యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. సభా స్థలి ఏర్పాట్లను పోలీస్ అధికారులు పలుమార్లు పరిశీలించారు. నగరంలో జరిగే ప్రదర్శనతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: రాజ్‌కోట్‌లో రప్పా రప్పా ఆడించిన రాహుల్..
Follow Us On : WhatsApp


