కలం, నల్లగొండ బ్యూరో : అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. నాడు సాయుధ రైతాంగ పోరాటమైనా, రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి, మలి దశ ఉద్యమాలైనా ఈ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత. పెత్తందారీతనం, కుల అహంకారం, ఆధిపత్య ధోరణిని ఈ జిల్లా సహించదనేదానికి అనేక ఉదాహరణలు. అందుకే తాజా రాజకీయాల్లోనూ (Nalgonda Politics) ఇలాంటి ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా అసంతృప్తి, అసమ్మతి నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నది. అది ఎప్పుడు దావానలంగా మారుతుందో ఊహించడం కష్టమే. పార్టీలేవైనా ఈ జిల్లాల్లో ఒక్క కులానిదే పెత్తనం అనేది బహిరంగ రహస్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లు నేతలుగా ఎదగనీయకుండా పార్టీలేవైనా ‘రెడ్డి’ నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఐక్యంగా ఉంటారన్నది ఓపెన్ టాక్.
ఏ పదవైనా తొలుత ఆ క్యాస్ట్ నేతలకే.. :
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ‘రెడ్డి’ లీడర్ల గ్రహణం పట్టుకున్నదనేది అన్ని పార్టీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు బహిరంగంగానే కామెంట్ చేస్తుంటారు. రాజకీయ పార్టీ ఏదైనా రెడ్డి లీడర్లదే పెత్తనం. కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీఆర్ఎస్, బీజేపీ అనే తేడాలే ఉండవ్. బీసీలకు పదవులు దక్కితే రెడ్డి నేతలు పాతాళానికి తొక్కేస్తారన్నది బలమైన విమర్శ. కాంగ్రెస్‌లో ఆ మోతాదు కాస్త ఎక్కువే. ఏ స్థాయి పదవులైనా జిల్లా అంతటా రెడ్డి నేతలదే ‘కీ రోల్’. రాష్ట్ర నాయకత్వానిదీ ప్రేక్షక పాత్ర. అదే తరహా ధోరణి. ఇటీవల నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవిని తన అనుచరుడికి ఆశించిన ఓ మంత్రి పున్న కైలాష్ (Punna Kailash) నేతకు దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అవకాశం వచ్చినప్పుడల్లా అవమానించడం షరా మామూలైంది. రాష్ట్ర నేతలైనా, మంత్రులైనా, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారైనా ఇదే తీరు. ‘రెడ్డి’ ఆధిపత్యం భవిష్యత్తులో బీసీ ఉద్యమానికి దారితీస్తుందనే కామెంట్లు ఇందులో భాగమే.
పార్టీలో కీలక పదవులన్నీ వారికే.. :
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్… పార్టీ ఏదైనా రెడ్డి లీడర్లకే నాయకత్వ బాధ్యతలు. పార్టీ పదవులు, ప్రజా ప్రతినిధి అవకాశాలూ వారికే… ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెడ్డి లీడర్లదే పెత్తనం. పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ వారిదే హవా. పార్టీల హైకమాండ్ సైతం వారికే మద్దతిస్తుండడం కొసమెరుపు. రాష్ట్ర మలి దశ ఉద్యమం నుంచి 2023లో అధికారం కోల్పోయేవరకు బండా నరేందర్ రెడ్డే జిల్లా అధ్యక్షుడు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుంటకండ్ల జగదీష్ రెడ్డిదే పెత్తనం. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గమైనా ఆయన చెప్పిందే వేదంగా నడిచింది. ఆయనను కాదంటే నియోజకవర్గ ఇంఛార్జి అయినా తిప్పలు తప్పవు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఫ్యామిలీలదే పైచేయి. పార్టీ పదవుల్లోనూ వీరి మాటే చెల్లుబాటు. సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన సీపీఎం సైతం జిల్లా కార్యదర్శి పదవిని దీర్ఘకాలం పాటు రెడ్డికే అప్పజెప్పింది. చెరుపల్లి సీతారాములు మినహా భీంరెడ్డి నర్సింహారెడ్డి మొదలు నంద్యాల నర్సింహారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, తుమ్మల వీరారెడ్డిలే జిల్లా కార్యదర్శులు. తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి నర్సింహులు మినహాయింపు. ఎలిమినేటి మాధవరెడ్డి, జానారెడ్డి, ఆ తర్వాత ఉమామాధవరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వీరే జిల్లా, రాష్ట్ర నేతలు. బీజేపీకి సైతం ప్రస్తుతం నాగం వర్షిత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు.
రాష్ట్రంలో ఒకలా.. నల్లగొండలో (Nalgonda Politics) ఇంకోలా.. :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవుల్లో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నది. కానీ నల్లగొండ జిల్లాలో మాత్రం ఈ ఫార్ములా హుష్ కాకి అయింది. జిల్లాలో రెండు మంత్రి పదవులూ (కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి) రెడ్డి కులానికే. దీనికి తోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం (దళిత్), పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరాలు (కమ్మ) మంత్రి పదవులు దక్కాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే వాకిటి శ్రీహరి (బీసీ), జూపల్లి కృష్ణారావు (వెలమ) కు దక్కాయి. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ (బీసీ), సీతక్క (ఎస్టీ) మంత్రులుగా ఉన్నారు. మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహా (ఎస్సీ), కరీరంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ (బీసీ), శ్రీధర్‌బాబు (బ్రాహ్మణ), అడ్లూరి లక్ష్మణ్ (ఎస్సీ), ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ (ఎస్సీ) మంత్రులుగా ఉన్నారు.
రాహుల్ బీసీ జపం బేఖాతర్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో లీగల్ చిక్కులతో అమలుకాలేదు. పార్టీపరంగా ఇస్తామన్న హామీ కూడా బుట్టదాఖలా అయింది. తాజాగా డీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను రెడ్డి లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రెడ్డి నేతల అనుచరులదీ అదే ధోరణి. డీసీసీ అధ్యక్షుడిగా పీసీసీ ఎవరిని నియమించినా కలిసి పనిచేయాలనే పార్టీ క్రమశిక్షణ ఉన్నా దాన్ని బేఖాతర్ చేస్తున్న రెడ్డి నేతలపై అటు ఇన్‌చార్జి, ఇటు పీసీసీ చీఫ్ చర్యలు తీసుకోకుండా సైలెంట్‌గా ఉండడం గమనార్హం. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్‌పై గొంతెత్తున్నా రెడ్డి నేతలు మాత్రం తూచ్.. అంటున్నారు. రాహుల్ మాటలను ధిక్కరించినా చర్యలు నిల్. రెడ్డి నేతలను మందలించడానికి హైకమాండ్‌కు భయమా?.. వారి క్యాస్ట్ అంటే గౌరవమా?.. రెడ్డి నేతల పట్ల పాజిటివ్ దృక్పథమా?.. ఇవీ ఇప్పుడు కేడర్‌లో వినిపిస్తున్న మాటలు.
బీసీ ఉద్యమం ప్రస్తావన అందుకోసమే :
నల్లగొండ జిల్లాలో రెడ్డి లీడర్ల చేతుల్లో ఏండ్ల తరబడిగా పార్టీ బందీ కావడంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలోనే ఉన్నది. వారి చెప్పుచేతల్లోనే ఉండాల్సి వస్తున్నది. బీసీ వర్గాల్లో అసంతప్తి ఆగ్రహం స్థాయికి చేరుకున్నది. కైలాష్ నేతకు రెడ్డి నేతలు సహకారం ఇవ్వకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మంత్రి పదవులతో పాటు పార్టీ పదవులూ వారికే దక్కాలా.. అంటూ మండిపడుతున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత ఒక బీసీ లీడర్‌కు డీసీసీ చైర్మన్ పోస్టు వస్తే రెడ్డి నేతలు సహించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి అంశంతోనే కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరిక వెనక సొంత పాపులారిటీ ఆశ ఉన్నదనే ఆరోపణలు ఎలా ఉన్నా బీసీ ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రస్తుత అసంతృప్తి పోరాట రూపంగా మారుతుందా?.. ఉద్యమం డైరెక్షన్ తీసుకుంటుందా? రెడ్డి ఆధిపత్యానికి వ్యతిరేకంగా బీసీలు ఏకతాటిపైకి వస్తారా..? ఇలాంటి చర్చలు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి.

Read Also: ‘పాలక్ పన్నీర్ వివక్ష’.. భారతీయ విద్యార్థులకు రూ.1.8కోట్లు పరిహారం
Follow Us On: X(Twitter)


