కలం, వెబ్‌డెస్క్: పాలక్ పన్నీర్ (Palak Paneer) కూర కారణంగా ఎదురైన వివక్ష ఆ విద్యార్థులకు రూ.1.8కోట్లు పరిహారం వచ్చేలా చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. భారత్‌కు చెందిన ఆదిత్య ప్రకాశ్, ఊర్మి భట్టాచార్య అమెరికాలోని బౌల్డర్ సిటీలో ఉన్న కొలరాడో యూనివర్సిటీలో పీహెచ్డీ చదివేవాళ్లు. ఊర్మి అక్కడే అసోసియేట్ టీచింగ్ స్టాఫ్‌గా పార్ట్‌టైమ్ జాబ్ చేసేది. 2023లో ఓ రోజు ఇంటి నుంచి బాక్స్‌లో తెచ్చుకున్న పాలక్ పన్నీర్ కూరను మైక్రోవేవ్‌లో ఆదిత్య ప్రకాశ్ వేడి చేశాడు. అయితే, దీనిపై క్యాంటీన్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాసన వస్తోందంటూ అడ్డుకున్నారు. దీంతో తాను కేవలం వేడి చేస్తున్నానని ఆదిత్య బదులిచ్చాడు. దీంతో మాటామాటా పెరిగి, ఆదిత్య ఆహారపు అలవాట్లను క్యాంటీన్ సిబ్బంది వెక్కిరించారు. తక్కువ చేసి మాట్లాడారు. క్యాంటీన్ సిబ్బంది ప్రవర్తను, మాటలను ఊర్మి సైతం తప్పుబట్టారు.
దీంతో యాజమాన్యం వాళ్లపై కక్ష కట్టింది. పాలక్ పన్నీర్ (Palak Paneer) గొడవ గురించి పదే పదే మాట్లాడేందుకు పిలిచి ఇబ్బంది పెట్టారు. అలాగే ఊర్మిని ఉద్యోగం నుంచి తీసేశారు. దీనిపై ఆదిత్య, ఊర్మి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఇది కచ్చితంగా జాతి వివక్షేనని న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దాదాపు రెండేళ్లు కొనసాగింది. ఈ క్రమంలో యూనివర్సిటీ దిగొచ్చింది. భారతీయ విద్యార్థులకు జరిగిన అవమానానికి, కలిగిన ఇబ్బందికి పరిహారంగా రూ.2లక్షల డాలర్లు (రూ.1.8కోట్లు) ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, భవిష్యత్తులో యూనివర్సిటీలో ఎలాంటి కోర్సు, ఉద్యోగం పొందకుండా నిషేధించింది. గత నెలలో భారత్‌కు తిరిగొచ్చిన ఆదిత్య, ఊర్మి ఈ విషయంపై స్పందించారు. డబ్బు ముఖ్యం కాదని, వివక్ష ఎలాంటి రూపంలో తప్పేనని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాగా, వారి పోరాటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


