కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమంపై లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖ కార్యదర్శి మద్యం కంపెనీల చుట్టూ తిరుగుతూ, వచ్చే ఎండాకాలం కోసం బీర్ల (Beer) ఉత్పత్తిని పెంచాలని సూచించడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.
రైతులకు అవసరమైన యూరియా (Urea) సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు మద్యం కంపెనీల చుట్టూ తిరిగే బదులు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలని హితవు పలికారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగు నీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ హాస్టళ్లు, ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక అవసరాలను తీర్చడం మానేసి, కేవలం మద్యం ద్వారా వచ్చే ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పంథా మార్చుకుని సామాన్యుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
Read Also: హరీశ్ రావు పార్టీ మార్పు.. బీఆర్ఎస్ క్లారిటీ
Follow Us On : WhatsApp


