కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విచారణలు, సిట్ (SIT)ల పేరుతో అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆయన విమర్శించారు.
ఒక మంత్రి పీఏ పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించి రూ.300 కోట్లు డిమాండ్ చేసినా, ములుగు జిల్లాలో మంత్రి అనుచరులు ఇసుక దందాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి కుమారుడు భూకబ్జాకు పాల్పడితే, సదరు అధికారిని బదిలీ చేయడం ఏ రకమైన పాలన అని నిలదీశారు.
కస్తూర్బా పాఠశాలల్లో బెడ్ల కొనుగోలు కుంభకోణం, లిక్కర్ హోలోగ్రామ్ టెండర్లు, వర్సిటీ భూముల అక్రమ విక్రయాలపై సుప్రీంకోర్టు కమిటీ తప్పుబట్టినా విచారణ ఊసేలేదని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కానీ, మంత్రుల అంతర్గత విభేదాల వల్ల వచ్చిన వార్తలను ప్రసారం చేసినందుకు మీడియా సంస్థలపై సిట్ వేయడం కేవలం వేధింపులకేనని ఆరోపించారు.
ఎవరిని కాపాడటానికి, ఎవరిని వేటాడటానికి ఈ సిట్లను ఏర్పాటు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియాపై వేధింపులు ఆపకపోతే ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
Read Also: బీర్లపై ఉన్న శ్రద్ధ.. యూరియాపై ఏది?: శ్రీనివాస్ గౌడ్
Follow Us On: Sharechat


