epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీఆర్‌ఎస్‌కు నాలుగోసారి వాత తప్పదు: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజలు ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ వారికి నాలుగోసారి వాత తప్పదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) హెచ్చరించారు. మంగళవారం ఆయన అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అధికారం పోయిందన్న అక్కసుతోనే విమర్శలు

పదేళ్ల కాలంలో పేదలకు కనీసం ఇళ్లు కూడా కట్టించలేని వారు, ఇప్పుడు అధికారం కోల్పోయిన కక్షతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని, 69 శాతం సీట్లు గెలిచి పార్టీ తన జైత్రయాత్రను చాటిందని గుర్తుచేశారు. ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, పట్టుమని పది మంది సర్పంచులను గెలిపించుకోలేని వారు తామే గెలిచామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

అశ్వారావుపేట గిరిజన ప్రాంతంపై తమ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందులో భాగంగానే ఈ నియోజకవర్గానికి 4,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు పొంగులేటి వెల్లడించారు. అలాగే మేడారం జాతరను 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని విధంగా అద్భుతమైన రాతి కట్టడాలతో పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనను సరిచేసి, శాస్త్రీయంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

కష్టపడి పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను ప్రభుత్వం పొట్టలో పెట్టుకొని కాపాడుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయాలకు మూలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్, కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

Minister Ponguleti
Minister Ponguleti

Read Also: పాకిస్థాన్–చైనా అక్కడ ఏం చేసినా చట్టవిరుద్ధమే : భారత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>