కలం, స్పోర్ట్స్: ‘‘నేను జీవితంలో అత్యంత కష్టంగా గడిపిన సంవత్సరం 2025. అన్ని వైఫల్యాలే. ఒకానొక దశలో నాపైన నాకే నమ్మకం పోయింది’’ అని భారత స్టార్ షట్లర్ ప్రణయ్ (HS Prannoy) తన కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. 2025 అతనికి అత్యంత కఠినమైన సంవత్సరం. 19 బీడబ్ల్యుఎఫ్ టోర్నమెంట్లలో పాల్గొన్నా ఒక్కసారి కూడా రెండో రౌండ్ దాటలేకపోయాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలు, నిలకడలేని ఫామ్ అతన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
2024 చివర్లో వచ్చిన చికెన్‌గున్యా ఊహించని దెబ్బ కొట్టిందని చెప్పాడు దాని నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర పట్టిందన్నాడు. 2025 మధ్యలో ఫామ్ మెరుగుపడుతున్న వేళ కొరియాలో మరో గాయం అతన్ని మళ్లీ వెనక్కి నెట్టిందని.. వయసు పెరుగుతున్న కొద్దీ గాయాల నుంచి కోలుకోవడం కష్టమవుతుందని అంగీకరించాడు ఈ 33ఏళ్ల షట్లర్. అయితే ఇప్పుడు నిరాశ కంటే కృతజ్ఞతకే ప్రాధాన్యం ఇస్తున్నానని ప్రణయ్ అన్నాడు.
ఇండియా ఓపెన్ 2026లో చివరి నిమిషం ఉపసంహరణలతో ప్రణయ్‌కు సూపర్ 750 ప్రధాన డ్రాలో అవకాశం దక్కింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంక్ 36లో ఉన్న తనకి ఇది స్వదేశంలో కీలక అవకాశమని, దీనిని అదృష్టంగా కాకుండా పట్టుదలకు లభించిన ఫలితంగా చూస్తానని చెప్పాడు. పురుషుల సింగిల్స్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో దూర లక్ష్యాలకంటే తక్షణ ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టాడు.
“ఆట నాలో ఉంది. శారీరకంగా బలంగా ఉండటమే ఇప్పుడు అసలు లక్ష్యం” అని స్పష్టం చేశాడు. గత ఏడాది లోపించిన నమ్మకం ఇప్పుడు మళ్లీ వస్తోందని అంటున్నాడు. అనంతరం భారత పురుషుల సింగిల్స్‌పై కూడా ప్రణయ్ మాట్లాడాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో ప్రతిభకు కొదవ లేదని, యువకులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆయుష్ షెట్టీ లాంటి యువత సిద్ధంగా ఉన్నారని, టాప్ 30లోకి రావాలంటే ఎక్కువ మద్దతు అవసరమని చెప్పాడు. 2023 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల పతకం, థామస్ కప్ విజయం ఇవన్నీ అనుభవంగా తీసుకుని ఇప్పుడు కొత్త దృక్పథంతో కోర్టులోకి దిగుతున్నానన్నాడు.

Read Also: అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పనున్న ఆస్ట్రేలియా స్టార్
Follow Us On: X(Twitter)


