కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణలో మున్సిపాలిటీలతో పాటు పలు కార్పొరేషన్లకు ఎన్నికలు (Municipal Elections) నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో మెజార్టీ మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లను కైవసం చేసుకోవడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఓటర్లకు నమ్మకం కుదిరే విధంగా ఏకంగా మంత్రులు రంగంలోకి దిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు కాగా సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మెజార్టీ మున్సిపాలిటీలు ఆ పార్టీ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 12మున్సిపాలిటిలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
కోడ్ కూయక ముందే..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జనవరి నెలలో వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కోడ్ రాక ముందే ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీల పరిధిలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చూడుతోంది. ఇటీవల రామగుండంకు ఓకే రోజు ఐదుగురు మంత్రులు వచ్చి సుమారు రూ. 175 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చూట్టారంటే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లపై ఫోకస్ ఎలా ఉందో అర్ధం అవుతుంది. మంత్రి శ్రీధర్ బాబు సైతం మంథని మున్సిపాలిటీ పరిధిలో సుడిగాలి పర్యటన చేసి కోట్ల రూపాయాల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు.
జిల్లాకు చెందిన మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం తన నియోజకవర్గం అయిన ధర్మపురిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసి అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. పట్టణాలతో అనుమతి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించడంతో పాటు గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీకారం చూడుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలకు బ్రేక్ పడుతుందని భావించి పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నారు.


