epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాచకొండ పేరు మార్పు వెనక కథ

కలం, తెలంగాణ బ్యూరో : రాచకొండ.. ఒకప్పుడు రేచర్ల పద్మనాయకుల పరిపాలనా కేంద్రం. అప్పటి రాచరిక వ్యవస్థకు ప్రతిరూపం. రాయలేలిన సీమ రతనాల సీమ తరహాలో వెలమలేలిన రాజ్యం రాచకొండగా ప్రసిద్ధి. రాచకొండ పేరుతో గత ప్రభుత్వం పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేసినప్పుడే ఆ సామాజికవర్గ ప్రజల్లో ఒకింత సంతోషం వ్యక్తమైంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ కూడా కట్టాలనుకున్నది బీఆర్ఎస్. పన్నెండేండ్ల తర్వాత రాచకొండ పదం ఇక ఎప్పటికీ వినిపించకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌గా (Malkajgiri Commissionerate) మార్చింది. తమిళనాడులో కరుణానిధి, జయలలిత ప్రతీ ఐదేండ్లకోసారి అధికారంలోకి వచ్చినప్పుడల్లా సిటీ బస్ నెంబర్లను కేకే, జేజే అని మార్చేవారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటివి పొడసూపుతాయేమో.. అందుకు రాచకొండ పదమే ప్రారంభం కాబోలు.. అనే చర్చ మొదలైంది.

వెలమ, రెడ్డి రాజుల మధ్య వైరం :

వెలమ, రెడ్డి రాజుల వైరానికి రాచకొండ కోట నిలువుట్టదం! కాలగతిలో రాజులు పోయారు.. రాజ్యాలూ పోయాయి.. కానీ, తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేండ్ల పాటు రాచకొండ రాజసం మళ్లీ ఉట్టిపడింది. వెలమ రాజుల చరిత్ర మళ్లీ స్ఫురణలోకి వచ్చింది. ఒక పోలీసు కమిషనరేట్‌, ఒక ఫిలిం సిటీకి రాచకొండ పేరు కనిపించింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి అయిన రెండేండ్లకు రాచకొండ పదం చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. పరిపాలనా సౌలభ్యం కోసమే పేర్ల మార్పు జరిగిందా?.. దానికి మరో కారణమేమైనా ఉన్నదా?.. ఇది ఇద్దరు వ్యక్తుల ఆలోచనా ధోరణికి నిదర్శనమా?.. రెండు కులాలకు సంబంధించిన వ్యవహారమా?.. చరిత్రలో పద్మనాయకులకు, రెడ్డి నాయకులకు మధ్య కొనసాగిన వైరానికి ప్రతీకారమా?.. ఇవీ ఒక సెక్షన్ ప్రజల్లో చోటుచేసుకున్న చర్చ.

శతాబ్దాల క్రితమే రక్తపాత చరిత్ర :

రాచకొండ చరిత్ర తెలుసుకోవాలంటే కాకతీయుల కాలానికి వెళ్ళాలి. ఓరుగల్లు కేంద్రంగా 12, 13వ శతాబ్దంలో కాకతీయులు రాజ్యాన్ని పాలించినప్పుడు వారికి రేచర్ల పద్మనాయకులు సామంతులు. ఆమనగల్లు వారి పరిపాలనా కేంద్రం. కాకతీయుల పాలన చివరి దశలో రాచకొండ రాజధానిగా పద్మనాయకులు రాజ్యాన్ని ఏలారు. నల్గొండ, పాలమూరు ప్రాంతాల పరిధిలో పది కొండల నడుమ విస్తరించి ఉన్న రాచకొండ కోట ఫిరంగులు వచ్చి మీదపడినా చెక్కు చెదరనంత శత్రు దుర్బేధ్యమైనది. తన తండ్రి మొదటి సింగమనాయుడి మరణానికి కారణమైన సోమకుల వంశస్తులను, వారికి సహకరిస్తున్నారని రెడ్డి రాజులను సోదరుడు మదన నాయుడితో కలిసి చంపిన అనంతరం ఈ వేదికగా రేచర్ల అనపోతనాయుడు పాలించారు. రెండు రాచరిక వంశాల నడుమ నిర్దిష్ట కాలంలో సాగిన రక్తపాతం ప్రతీకారం రూపంలో ఆ తర్వాత కొన్ని తరాల వరకూ కొనసాగింది.

శత్రువులనెత్తుటితో నైవేద్యం.. :

చరిత్ర ప్రకారం… రాచకొండ కోటలో ప్రత్యేకంగా ‘రణ పిశాచి’ అనే విగ్రహం ఉంటుంది. దాన్ని అప్పట్లో ‘ధన పిశాచి’ అని కూడా పిలిచేవారట. ఈ కోట నుంచే పద్మనాయకులు తమకు శత్రు శేషం లేకుండా యుద్ధ వ్యూహాలు రచించేవారు. రెడ్డి రాజులను చంపి వారి రక్తాన్ని తెచ్చి నైవేద్యంగా వండి ‘రణ పిశాచి’కి సమర్పించేవారట! పెద్దల ఆత్మశాంతి కోసం ఇలా వెలమ పద్మనాయకులు చేసేవారని ప్రతీతి. రెడ్డి రాజులపై వెలమ రాజుల పగ ఇలా చల్లారేదని అంటుంటారు. అదంతా ఒకప్పటి చరిత్ర! ఆ చరిత్రకు ఆనవాళ్లుగా రాచకొండ గుట్టలు ఉన్నాయి. వాటిపై శిథిలమైన శాసనాలూ ఉన్నాయి.

స్ఫురణకొచ్చేలా రాచకొండ నామకరణం :

ఒకప్పుడు పాలనా కేంద్రంగా ఉన్న రాచకొండను ఉమ్మడి ఏపీ పాలకులు పట్టించుకోలేదని కేసీఆర్‌కు అసంతృప్తి ఉండేదని సన్నిహితులు చెప్పుకునేవారు. అందుకే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలమ కుల పద్మనాయకుల కోట రాచకొండపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. రాచకొండను కమిషనరేట్‌ను ఏర్పాటుచేస్తూ 2016 జూన్‌లో జీవో వెలువడింది. అంతకు ముందు ఇది సైబరాబాద్ ఈస్ట్ గా ఉండేది. రాచకొండ కమిషనరేట్‌కు (Rachakonda Commissionerate) తొలి పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ మహేశ్ భగవత్‌ను కేసీఆర్ నియమించారు. వైశాల్యంలో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్లలో రాచకొండ ఒకటి.

రాచకొండ ఎప్పటికీ వినపడొద్దు.. :

పదేండ్ల తర్వాత బీఆర్ఎస్‌ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి రాచరిక ఆనవాళ్లను తొలగిస్తామంటూ, ప్రజా పాలన సాగిస్తామని మొదటి రోజుల్లోనే బహిరంగంగా స్పష్టం చేశారు. అందుకే అప్పట్లో సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌ను గడీ అని సంబోధించేవారు. పోలీసు కమిషనరేట్ పేరులోంచి రాచకొండ తీసేశారు. దాని స్థానంలో మల్కాజిగిరి అని ఖరారు చేశారు. ఇక కమిషనరేట్‌కు రాచకొండ పదం ఎప్పటికీ వినిపించదు. ‘‘నేను సీఎం అయిన తర్వాత రెండేండ్లలో రాచకొండ పోలీసు కమిషనరేట్ తప్ప ఏ పేరూ మార్చలేదు..” అని సీఎం రేవంత్ స్వయంగా చెప్పారు. గత పాలకులు రాచరికం ఆనవాళ్ళున్న పేరు పెడితే ఇప్పుడు ప్రజా ప్రభుత్వంగా దాన్ని తీసేశాం అని ప్రకటించారు.

లోగుట్టు ఆ ఇద్దరికే ఎరుక :

రాచకొండను పోలీసు కమిషనరేట్‌గా కేసీఆర్ (KCR) ప్రకటించినప్పుడు చాలా గుసగుసలు వినిపించాయి. రాచకొండ పేరును ఉచ్ఛరించినప్పుడల్లా వెలమ పద్మనాయకుల చరిత్ర ప్రచారంలో ఉంటుందనే భావనే కారణామేమో అనే మాటలూ వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇకపై ఆ పదమే వినిపించకుండా మార్పు చేశారు. రాచరిక పాలనలో రెడ్డి రాజులు, పద్మనాయకుల మధ్య వైరమే ఈ పేరు మార్చడానికి కారణమా?.. రెడ్డి రాజులను హింసించి చంపడంలోగానీ, రక్తంతో నైవేద్యం పెట్టే మానసిక ఆలోచనగానీ పద్మనాయకుల మీద రెడ్డి కులస్తులకు ఉన్న ఆగ్రహానికి నిదర్శనమా?.. లోగుట్టు పెరుమాళ్ళకెరుక చందంగా ఈ ఇద్దరు నేతల మదిలో ఏమున్నదోగానీ ఒకరు రాచకొండ పదం ఎప్పటికీ వినిపించేలా ఒకరు.. ఎప్పటికీ వినిపించకుండా ఉండేలా మరొకరు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాచకొండ కేంద్రంగా సాగిన పాలన గత చరిత్రగా మారినట్లే ఇప్పుడు రాచకొండ పోలీసు కమిషనరేట్ (Rachakonda Commissionerate) అనేది కూడా చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది.

Read Also: సంక్రాంతి సెలవుల్లో కవిత.. కొత్త పార్టీపై సమాలోచనలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>