epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

క్యాబినెట్ భేటీ @ మేడారం

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర చరిత్రలోనే క్యాబినెట్ మీటింగ్ (Telangana Cabinet Meeting) ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వెలుపల జరుగుతున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నెల 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఆ రోజు సాయంత్రం క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి బస కూడా అక్కడే మరుసటి రోజున లాంఛనంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రారంభించి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్ సమ్మిట్ (Davos Summit) కోసం బయలుదేరి వెళ్తారు. సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీ మరో చోట జరగడం ఉద్యోగుల్లోనే సరికొత్త చర్చకు దారితీసింది. గత ప్రభుత్వంలో పాత సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయ భవనం నిర్మాణం అనే కారణాలతో ప్రగతి భవన్‌లో జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా మేడారం జాతర దగ్గర వేదికకు షిప్ట్ కావడం గమనార్హం.

మంత్రులు, అధికార గణమంతా అక్కడికే :

క్యాబినెట్ మీటింగ్ కోసం మంత్రులే కాక చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా 23 శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. వీరంతా సచివాలయాన్ని, హైదరాబాద్‌ను విడిచిపెట్టి మేడారానికి వెళ్ళక తప్పదు. ఒకవైపు మేడారం జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే దగ్గర క్యాబినెట్ సమావేశం జరిగే నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అధికార గణమంతా అక్కడికి వెళ్ళడంతో పోలీసు భద్రత కూడా కీలక అంశమైంది. లక్షలాది మంది భక్తులు వస్తుండడంతో తగినంత పోలీసు భద్రత కల్పించాల్సిందిగా రెండు రోజుల క్రితమే డీజీపీకి మంత్రి సీతక్క (Seethakka) విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ కూడా అక్కడే నిర్వహిస్తుండడంతో వీరికి భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనున్నది.

మావోయిస్టులు లేరనే ధీమా కాబోలు :

మేడారం జాతర కోసం లక్షల సంఖ్యలో వచ్చే జనం సందడి మధ్య క్యాబినెట్ భేటీకి (Telangana Cabinet Meeting) ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రిటైర్డ్ అధికారులను విస్మయానికి గురిచేసింది. సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని మరోచోట నిర్వహించుకోవాల్సిన అవసరంపైనే ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నక్సలైట్లకు అడ్డాగా ఉన్న జంపన్నవాగు సమీపంలో ఇప్పుడు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఒక సాహసమని, ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం లేదనే ధీమాతోనేనా అనే మాటలూ వస్తున్నాయి. క్యాబినెట్ భేటీ ఇప్పుడు పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఒకవైపు లక్షలాది మంది భక్తులకు, మరోవైపు మంత్రులతో పాటు అధికారులకు భద్రత కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఏక కాలంలో రెండువైపులా సంతృప్తిపర్చాల్సిన బాధ్యతల్లో పోలీసులు తలమునకలయ్యారు.

Read Also: సచివాలయం @ కమాండ్ కంట్రోల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>