కలం, కరీంనగర్ బ్యూరో: మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పేదలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. సోమవారం మంథని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథని పట్టణంలో 37 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేశామని మంత్రి వివరించారు. తాజాగా మరో 22 కోట్ల రూపాయలను పెండింగ్ పనుల కోసం మంజూరు చేసినట్లు ప్రకటించారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం దాదాపు 17 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎంపికైన 317 మంది లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పథకంలో అవినీతికి తావులేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పేదవానికి విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పట్టణంలోని వివిధ వర్గాల కోసం 8 కోట్లకు పైగా వ్యయంతో 28 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) శంకుస్థాపన చేశారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటుకు భూమిని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే 4.5 కోట్లతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, బస్టాండ్, ఈద్గా నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు పద్ధతి కాదని, తాము చేసే అభివృద్ధి పనులే విమర్శకులకు సమాధానం చెబుతాయని మంత్రి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందని అన్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు.


