కలం/ఖమ్మం బ్యూరో : బిజెపి పాలనలో దేశ వ్యాప్తంగా నిర్బంధం పెరుగుతోందన్నారు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasiva Rao). బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో ఒక పక్క మావోయిస్టులను హతమారుస్తూ.. మరో పక్క ప్రశ్నించే వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో నిర్బంధాలకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బిజెపి భావిస్తుందని ఎమ్మెల్యే సాంబశివరావు విమర్శలు గుప్పించారు. సోమవారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడారు. వందేళ్ల పోరాట చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకు తప్ప ఏ పార్టీకీ లేదన్నారు. దేశంలో రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులతో పాటు ఇప్పటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో సహా ఎవరికి అన్యాయం జరిగినా వారి పక్షాన ఆందోళన చేపట్టేది కమ్యూనిస్టులేనన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు పురోగమిస్తున్నారని.. పెట్టుబడిదారి దేశం అమెరికా నడిబొడ్డున యువత సోషలిజాన్ని కాంక్షిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తుందంటే ప్రపంచ ప్రజల్లో వస్తున్న మార్పును గమనించవచ్చని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. భారతదేశంలో సైతం కమ్యూనిస్టుల ఐక్యత పురోగమించవచ్చని చెప్పారు. సీపీఐ పార్టీ వందేళ్ల పోరాట చరితను నేటి తరానికి తెలియజేయడంతో పాటు భవిష్యత్తు పోరాటాలకు ప్రజలను సంసిద్ధులను చేసేందుకు జనవరి 18న ఖమ్మంలో చారిత్రిక సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నట్టు వివరించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
20న భారతదేశం వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తామని.. ఇందులో ప్రధాన వామపక్షాల నేతలు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య, జి.దేవరాజన్ పాల్గొంటారని చెప్పుకొచ్చారు కూనంనేని. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read Also: సచివాలయం @ కమాండ్ కంట్రోల్
Follow Us On: Sharechat


