కలం, నల్లగొండ బ్యూరో : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ ఓ కొత్త లిక్కర్ డాన్ పుట్టుకొచ్చాడు. నిజానికి వైన్స్ షాపు నడపాలంటే.. లాటరీలో దక్కించుకుంటే చాలు. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం అలా కాదు. వైన్స్ నడపాలంటే.. సదరు లిక్కర్ డాన్ అనుమతి ఉండాల్సిందే. ఇక్కడ అబ్కారీ శాఖ రూల్స్ తో పనిలేదు. సదరు లిక్కర్ డాన్ చెప్పిందే వేదం. ఓ ప్రభుత్వ టీచర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఏకంగా నియోజకవర్గంలో లిక్కర్ కింగ్‌గా మారిపోయారు. తన లిక్కర్ సామ్రాజ్యానికి అడ్డొస్తుందని.. టీచర్ ఉద్యోగానికే రాజీనామా పెట్టేశారు. దీనికితోడు కొందరు పెద్ద లీడర్ల అండ తోడవ్వడంతో తనకు తిరుగులేకుండా పోయింది. తనతో చేతులు కలపని వైన్స్ నిర్వాహకులను ఎక్సైజ్ పోలీసుల సాయంతో ముప్పు తిప్పలు పెట్టడం.. షాప్‌లను సీజ్ చేయించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల ఓ వైన్స్ నిర్వాహకుడు సిండికేట్‌లో (Liquor Syndicate) కలవనందుకు ఆయన దుకాణాలను సీజ్ చేయించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సిండికేట్ దందాతో రూ.కోట్లలో ఆదాయం..
లిక్కర్ డాన్ దాదాపు పదేండ్లుగా సిండికేట్ (Liquor Syndicate) దందా చేస్తున్నాడు. సాగర్ నియోజకవర్గంలో గంపగుత్తగా మద్యం దుకాణాలు దక్కించుకోవడం.. ఇతరుల నుంచి లాక్కోవడం అతడికి పరిపాటి. అలా వైన్స్‌లను సిండికేట్‌గా చేసి ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు ఎమ్మార్పీ ధరకంటే అధికంగా అమ్ముతుంటారు. ఇలా అమ్మడం వల్ల సాగర్ నియోజకవర్గంలో రోజుకి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల ఆదాయం అదనంగా సమకూరుతోందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో కొత్తగా మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిపై లిక్కర్ డాన్ బెదిరింపులకు దిగుతున్నారు. సిండికేట్ పేరు చెప్పి మద్యం దుకాణాలను గుడ్ విల్ ఇచ్చి లాక్కోవడం.. కుదరకుంటే తాము చెప్పిన ధరలకే మద్యం అమ్మాలంటూ ఒత్తిడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మద్యం అక్రమ రవాణ దందాకు తేరలేపారు. దీంతో ఇక్కడి మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హాలియా, పెద్దవూరు, నిడమనూరు, గుర్రంపోడు వంటి మండలాల్లో అధికారిక షాపుల కంటే బెల్ట్ షాపులే ఎక్కువగా ఉన్నాయి. సదరు లిక్కర్ డాన్.. ఈ బెల్ట్ షాపుల నిర్వాహకుల వద్ద నుండి నెలవారీ మామూళ్లు వసూలు చేసి వాటాలు పంచుతుండడం గమనార్హం.
వేధింపులతో సూసైడ్ చేసుకున్న వైన్స్ యజమాని..
లిక్కర్ డాన్ వేధింపులు భరించలేక ఇటీవల నియోజకవర్గంలోని ఓ వైన్స్ షాపు నిర్వాహకుడు పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. పెద్దవూర మండల కేంద్రంతో పాటు నాగార్జునసాగర్‌లో తనకు లాటరీ ద్వారా వచ్చిన వైన్స్‌లను చిన్న చిన్న కారణాలను చూపి సీజ్ చేశారని ఆ వైన్స్ నిర్వాహకుడు ఆరోపించారు. లిక్కర్ డాన్ ఏర్పాటు చేసిన సిండికేట్‌లో చేరకపోవడం వల్లే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. లిక్కర్ డాన్‌కు ఎక్సైజ్ పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ అర్ధరాత్రి వైన్స్ దుకాణాలను సీజ్ చేయించారని ఆరోపిస్తున్నాడు వైన్స్ నిర్వాహకుడు. ఇంత జరుగుతున్నా సరే సదరు లిక్కర్ డాన్ మీద ఎక్సైజ్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
Read Also: ఐఐటీ హైదరాబాద్‌లో నెక్ట్స్ జెన్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం
Follow Us On : WhatsApp


