కలం/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కొత్తగూడెం (Kothagudem) నగర పాలక సంస్థ తుది ఓటర్ల జాబితాను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కార్పొరేషన్లో 60 డివిజన్లకు సంబంధించిన తుది ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ కోడూరి సుజాత ప్రకటించారు. కానీ కోర్టు కేసులు, కొంత మంది అభ్యంతరాల మధ్య ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానంలో ప్రజలు ఉన్నారు.
ఎన్నికల నిర్వహణ పై నీలి నీడలు..
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ షెడ్యూల్ ఏరియాలో ఉంది. దీంతో పాల్వంచను ఎలా కలుపుతారంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే షెడ్యూల్ ఏరియాను మార్చాలన్నా, సవరించాలన్నా పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.
కొత్తగూడెం, పాల్వంచ మధ్య ఉన్న లక్ష్మీదేవిపల్లి.. కొత్తగూడెం, సుజాతనగర్ మధ్య ఉన్న చుంచుపల్లి పంచాయతీలను వదిలేసి, సుజాత నగర్, కొత్తగూడెం పాల్వంచను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కాగా షెడ్యూల్ ఏరియాకు సంబంధించిన అంశం ఈ నెల 19కి వాయిదా పడగా, మిగిలిన పిటిషన్లకు సంబంధించి ఈ నెల 27వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఒక పక్క కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ, అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో వారంలో నోటిఫికేషన్ వస్తుందని అధికారులు చెప్తుండగా.. నోటిఫికేషన్ వచ్చినా కోర్టు స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొంటున్నారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) ఎన్నికలు జరుగుతాయో లేదో వేచి చూడాలి.
మహిళా ఓటర్లే అధికం..
కొత్తగూడెం కార్పొరేషన్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మహిళల ఓట్లు 70,314 ఉండగా.. పురుషు ఓటర్లు 64,431 మంది ఉన్నారు. ఇతరులు 30 మంది కలుపుకొని మొత్తం 1,34,775 ఓట్లు ఉన్నాయి.
Read Also: బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి పొన్నం
Follow Us On: Instagram


