కలం, ఖమ్మం బ్యూరో : పీడన నిర్బంధాల నుంచి ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని ఆ ఉద్యమాలను నడిపించేది కవుల కలాలేనని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) తెలిపారు. ప్రజలే ఇతివృత్తంగా నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రజలను ఆలోచింపజేసేదే సరైన కవిత్వమని ఆయన ఉద్బోధించారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం, సిపిఐ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో డిపిఆర్‌సి భవన్ లో సోమవారం కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది కవులు రచించిన కవితా సంకలనం నూరేళ్ల అరుణ కేతనాన్ని సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు.
ఇదే సభలో అభ్యుదయ రచయితల సంఘం (ARASAM) బాధ్యులు కొంపెల్లి రామయ్య (Kompelli Ramaiah) రచించిన నా గమనం కవితా సంపుటిని సైతం సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కెవిఎల్ అధ్యక్షతన జరిగిన సభలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ కమ్యూనిస్టుల త్యాగాలు వెలకట్టలేనివని ఆ త్యాగాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. కమ్యూనిస్టులంటే సమాజ మార్పును కోరుకునే వారని పీడిత తాడిత ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడి హక్కుల కోసం పోరాడేవారని ఓట్లు, నోట్ల కోసం కమ్యూనిస్టు పార్టీ పుట్టలేదన్నారు. శ్రీశ్రీ చెప్పినట్లుగా దొంగ ఓట్లు, దొంగ నోట్లు ఇచ్చు రాజ్యము రాజ్యమా అని మారిన పరిస్థితుల్లో ఓట్లు, సీట్లతో కమ్యూనిస్టుల బలాన్ని అంచనా వేయలేమన్నారు.
వందేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక పోరాటాలను చేశారని ఆ పోరాటాల వెనక త్యాగాలు ఉన్నాయని ఆ త్యాగాలకు కూడా వందేళ్లు నిండాయని మరో వెయ్యేళ్లయినా కమ్యూనిస్టుల రాజీలేని పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్యాగధనులు అరుదు కావచ్చు కానీ కరువు కాలేదని కమ్యూనిస్టుల రూపంలో త్యాగధనులు ఇంకా సజీవంగా ఉన్నారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులకు బలమే లేదంటున్న వారు కమ్యూనిస్టులను చూసి ఎందుకు భయపడుతున్నారని, మోడీ అమిత్‌షాలు ఎందుకు టార్గెట్లు విధించి మరణ శాసనం రాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సమాజం కోసం ఏదైనా చేస్తే అది కమ్యూనిస్టులేనని ఆయన తేల్చి చెప్పారు.

Read Also: ప్రభుత్వ ఆస్పత్రిలో ఐఏఎస్ సతీమణి ప్రసవం..
Follow Us On: Sharechat


