కలం, వెబ్ డెస్క్: తల్లిదండ్రుల సంరక్షణపై ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి జీతంలో నుంచి 10–15 శాతం వరకు కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ‘బాల భరోసా’ పథకం, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్ల ద్వారా దివ్యాంగులు, వృద్ధులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు అవసరమైన సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇందుకు సుమారు రూ.50 కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు.
దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకుంటే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే దివ్యాంగులను ఇతరులు వివాహం చేసుకున్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందన్నారు.


