కలం, మెదక్ బ్యూరో : సింగూర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు సాగునీరు (Singur Water) విడుదల చేయలేమని అధికారులు చెప్పడంపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్రాప్ హాలిడే ప్రకటించాలని, నష్టపోతున్న రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు సాగునీటి కోసం ఎప్పుడూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి లేదని ఆమె గుర్తుచేశారు. సింగూర్ జలాలపై (Singur Water) మెదక్ జిల్లా రైతులకే పూర్తి హక్కు ఉందని, ఘనపూర్ ఆయకట్టు కింద ఉన్న పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆమె విమర్శించారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, సాగునీటి సమస్యపై రైతులంతా ఏకమై ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు రెండేళ్ల పాటు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, ఈ విషయంలో సీఎం వెంటనే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Read Also: తల్లిదండ్రుల సంరక్షణపై ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్
Follow Us On : WhatsApp


