కలం, నిజామాబాద్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ ప్రజల చేత చీత్కరించబడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ (BRS) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వి.జి. గౌడ్, మాజీ మేయర్ నీతు కిరణ్, సిర్ప రాజు, సూజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని తీవ్రంగా విమర్శించారు. 2500 రూపాయల చేయూత పెన్షన్ ఇప్పటికీ పుట్టనే లేదని, 2000 రూపాయల పెన్షన్‌ను 4000 చేస్తామని చెప్పి చేయలేదని గుర్తు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, రెండు లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, విద్యా భరోసా కార్డు వంటి హామీలు అన్నీ గాల్లో కలిసిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా ఆ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, సర్పంచ్ ఎన్నికల్లోనే ఆ విషయం స్పష్టమైందన్నారు. “బీజేపీ పని అయిపోయింది” బీజేపీ మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇక చెప్పుకునేందుకు బీజేపీకి ఏమి మిగలలేదని స్పష్టం చేశారు.
గత ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి లీడ్ ఇచ్చిన బాల్కొండ గ్రామంలో కూడా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని, బిజెపి మూడవ స్థానానికి పడిపోయింది అని గుర్తు చేశారు. భీంగల్ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులే సాక్ష్యంగా నిలిచి, ప్రజలు 12కి 12 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని తెలిపారు. నిజామాబాద్ అర్బన్‌లో మనం గట్టిగా పని చేస్తే 30కి పైగా కార్పొరేటర్ స్థానాలను గెలుచుకునే పూర్తి అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముమ్మాటికీ కేసీఆర్ వైపే ఉన్నారని, మనం గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు సరిగ్గా చెప్పగలిగితే విజయం ఖాయమన్నారు.
పార్టీలో అనుభవజ్ఞులైన సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ బలంగా ఉన్నారని, నిబద్ధతతో పనిచేసే ప్రతి డివిజన్‌కు ఇద్దరు ముగ్గురు నాయకులు చాలు… ఎన్నికలలో గెలవచ్చని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, గణేష్ గుప్తా అర్బన్ ప్రజల్లో ఉన్నారని స్పష్టం చేశారు. గత పదేళ్లలో గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి అనేక కీలక పనులు చేశారని, ఆ సంఘం ఈ సంఘం అని చూడకుండా ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయించారని చెప్పుకొచ్చారు. ఒకప్పటి నిజామాబాద్‌తో పోలిస్తే ఇప్పటి నిజామాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, అది కేసీఆర్ నాయకత్వం, గణేష్ గుప్తా కృషి వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేస్తూ, మనం మాత్రం గడప గడపకు వెళ్లి గత 10 ఏండ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో తిరిగితే ప్రజలు మనల్ని హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ధైర్యం చెప్పారు.
Read Also: ‘సాగునీరు ఇవ్వకుంటే.. పరిహారం చెల్లించాలి’
Follow Us On : WhatsApp


