కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపు గాలివాటం అని కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనవసరం విషయాలపై రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. దేశంలో అనేక పథకాల పేర్లు మార్చామని అందులో భాగంగానే ఉపాధి హామీ చట్టం పేరు కూడా మార్చామని కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఉనికిలో లేదని.. సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు కేవలం గాలివాటమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తామే అసలైన ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ గెలుపు గాలివాటం అయితే దేశంలో మూడు సార్లు ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు.


