కలం, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇరు రాష్ట్ర నేతలు నీటి వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మరోసారి స్పందించారు. హెఓడీలు, సెక్రెటరీలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు, ఇది పూర్తి అయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తుంది. “పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం వలన శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమ (Rayalaseema)కు అందిస్తున్నాం, నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ,ప్రకాశం వంటి ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. ” అని చంద్రబాబు తెలిపారు.
ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన తెలిపారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు పడలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అయితే రాబోయే పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును(Polavaram Project) పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.


