కలం, నిజామాబాద్ బ్యూరో: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నిజామాబాద్‌లో సంచలన కామెంట్స్ చేశారు. శ్రీరాముడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడా అని ప్రశ్నించారు. శ్రీరాముని పేరు చెప్పి బీజేపీ ఎలా ఓట్లు అడుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరాముడి పేరు చెప్పే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే హిందూ-ముస్లిం అని గొడవలు సృష్టిస్తారని దుయ్యబట్టారు. దేవుళ్ళ పేరుతో గెలిచిన బీజేపీ దేశ ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలన్నారు. తాము కూడా శ్రీరాముడు, వేంకటేశ్వరుడు, దుర్గా మాతకు పూజలు చేస్తామని, మేము హిందువులమే అని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణాకు వస్తే, కవిత (Kavitha) పార్టీ పెడితే స్వాగతిస్తామని ప్రకటించారు. కవిత సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితి బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ మొదటి స్థానం సాధించిందని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. పథకాలు, ఊర్ల పేర్లు మార్పు కాదు.. యువత, ప్రజల జీవితాలు బాగుపర్చాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో మూడేళ్లలో లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
రాష్ట్రాభివృద్ధికి రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారని, ఆయన విజీనరి లీడర్ అని అన్నారు. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసరలను కలుపుతూ టెంపుల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరీంనగర్ నుంచి నిజమాబాద్‌కు 26 కిలో మీటర్ల దూరం తగ్గిస్తూ 4లైన్ రోడ్డును నిర్మిస్తామని మహేశ్ గౌడ్ అన్నారు. 7 ఏళ్లుగా ఎంపీ అర్వింద్ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని, నిజమాబాద్‌ను ఇందూరుగా మారిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయా? అని అర్వింద్‌ను ప్రశ్నించారు. ఓటర్ లిస్టుల్లో తప్పులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం, ప్రయత్నాలు కొనసాగుతాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


