epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సమస్యల ప్రాంగణం.. కొత్తగూడెం బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరం కార్పొరేషన్ స్థాయికి చేరినప్పటికీ, బస్టాండ్ (Kothagudem Bus Stand) వసతులు మాత్రం పాతకాలం స్థాయిలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన సమాచార కేంద్రం ఉన్నా.. దాని వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. బస్సుల రాకపోకలు, సమయపాలన వివరాలు తెలియజేయాల్సిన సమాచార కేంద్రంలో సంబంధిత అధికారి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు కొత్తగూడెం బస్టాండ్‌ను ఆశ్రయిస్తుండగా, ఏ బస్సు ఎప్పుడు వస్తుంది? ఏ ప్లాట్‌ఫాంలో నిలుస్తుంది? ఆలస్యం ఉందా లేదా? వంటి కనీస సమాచారం కూడా లభించకపోవడం గమనార్హం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. సమాచార కేంద్రం ఉన్నప్పటికీ, అక్కడ ఎవరూ విధులు నిర్వహించకపోవడం వల్ల ప్రయాణికులు డ్రైవర్లు, కండక్టర్లు లేదా ఇతర ప్రయాణికులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

కొన్నిసార్లు తప్పుడు సమాచారం వల్ల బస్సులు మిస్సవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి సమాచార కేంద్రంలో సిబ్బందిని నియమించి, బస్సుల సమయపాలనను సక్రమంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే ప్రయాణికుల సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్ కూడా చాలా పాతబడి ఉంటుంది, బస్టాండ్ లో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్ కూడా పాతవే. తాగు నీటి సౌకర్యం లేదు. గోడలు బీటలు వారి ఉన్నాయి. ఒక జిల్లా కేంద్రానికి లేదా కార్పొరేషన్ కు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు అని చెప్పాలి. ఈ బస్టాండ్ ను 1976లో జలగం వెంగల్ రావు ప్రారంభించారు. అంటే యాబై ఏళ్ల నుంచి ఈ బస్టాండ్ ఆధునీకరణకు నోచుకోలేదు. ఇటీవల ఆర్టీసీ ప్రవేశపెట్టిన బస్టాండ్ ల ఆధునీకరణ పథకంలో ఈ బస్టాండ్ ను కూడా చేర్చి పునరుద్ధరించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Read Also: రేవంత్ నిజాయితీ గల మోసగాడు : కేటీఆర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>