కలం, వెబ్‌డెస్క్: గుంటనక్కల్లాంటి శత్రుదేశాలకు గుండెల్లో గుబులు పుట్టేలా.. దాక్కుని వచ్చే ముష్కరులకు దడపుట్టేలా.. దాచిపెట్టే ఆయుధాలను పట్టేసేలా.. పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టి హెచ్చరించేలా.. భారత అమ్ములపొదిలోకి అత్యంత శక్తిమంతమైన అస్త్రం చేరనుంది. ఇది తూటా పేల్చదు.. మిస్సైల్ సంధించదు.. కానీ, తూటాలకు, మిస్సైల్స్‌కు, త్రివిధ దళాలకు అనుక్షణం అండగా ఉంటుంది. అవసరమైన దారి చూపుతుంది. దిశానిర్దేశం చేస్తుంది. అంతరిక్షం నుంచే అణువణువూ జల్లెడ పట్టి కావలసిన సాయం అందిస్తుంది. అదే ‘అన్వేష’(Anvesha). ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి రేపు (జనవరి 12న) నింగిలోకి వెళ్లనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తయారుచేసిన ఈ సూపర్ వెపన్ గురించి కొన్ని వివరాలు..
కొన్నేళ్లుగా దేశ రక్షణకు, అభివృద్ధికి ఉపయోగపడేలా అనేక అస్త్రాలను అందించింది ఇస్రో. ఈ క్రమంలో కొత్త ఏడాదిని మరో సరికొత్త ప్రయోగంతో ప్రారంభించనుంది. నిఘాలో సూపర్ పవర్‌గా నిలిచే అన్వేష శాటిలైట్‌ను ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని లాంచింగ్ పాడ్ నుంచి అన్వేషతోపాటు 18 శాటిలైట్లను పీఎస్ఎల్వీ–సీ62 (PSLV-C62) వాహననౌక ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టీ అన్వేష శాటిలైట్పైనే ఉంది. ఎందుకంటే సాధారణ శాటిలైట్ కాదు. హైపర్‌స్పెక్ట్రల్ శాటిలైట్ అని ఇస్రో చెబుతోంది.
అన్వేష ప్రత్యేకత ఏంటంటే..
అంతరిక్షం నుంచి దేశాన్ని నిత్యం కనిపెట్టుకొని ఉండేందుకు సాధారణ శాటిలైట్లు చాలానే ఉన్నాయి. కానీ, డీఆర్డీవో తయారుచేసిన ఈ ‘అన్వేష’ (Anvesha) మాత్రం స్పెషల్. మిగిలిన నిఘా శాటిలైట్స్ కేవలం రంగులను మాత్రమే కనిపెడతాయి. కానీ, అన్వేషలో హెచ్ఆర్ఎస్(హైపర్‌స్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్) ఉంటుంది. ఇది కాంతిని వందలాది సూక్ష్మ తరంగాలు విడగొట్టి చూడగలదు. అంటే, మన కంటికి కనిపించని వాటిని కూడా అత్యంత స్పష్టంగా చూడగలదు. దీనివల్ల నేల మీద ఉన్న వస్తువు ఏంటి? అది దేనితో తయారైంది? అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ సాయంతో వందలాది ఫొటోలను అత్యంత కచ్చితత్వంతో విశ్లేషించి, వాటిలోని సమాచారాన్ని అందిస్తుంది. నీళ్లు ఉంటే ఒకలా, ఎత్తైన బండరాళ్లు ఉంటే మరోలా వచ్చే తరంగాలను అన్వేష శోధించి, వాటి గురించి వెల్లడిస్తుంది.
శత్రువులు.. ఆయుధాలు..
అడవుల్లో దాచిన ట్యాంకులు, గడ్డి ముసుగులో ఉండే బంకర్లు, మట్టిలో.. ఆకుల్లో కలసిపోగలిగే రంగులు తయారుచేసిన బంకర్లు, ట్యాంకర్లు, ఆయుధాలు అన్నింటినీ అన్వేష గుర్తించగలదు. ఒక్క మాటల్లో చెప్పాలంటే శత్రువులు, యుద్ధ సామగ్రి అన్వేష కంటి నుంచి తప్పించుకోలేవు. అలాగే, మన సైనికులు, వాహనాలు ప్రయాణించేటపుడు అది ఎలాంటి నేల? అందులో బురద ఉందా? ట్యాంకులు వెళ్లగలవా? అనేది ముందే తెలుసుకొని సమాచారం అందిస్తుంది. దారిలో పాతిపెట్టిన బాంబులను, అనుమానాస్పద వస్తువులను గుర్తించగలదు. 3డీ వర్చువల్ మ్యాప్‌లతో యుద్ధ పరిస్థితులను ముందుగానే కనిపెడుతుంది. సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ తరచూ కవ్వింపులకు, చొరబాట్లకు పాల్పడుతున్న నేపథ్యంలో శత్రువుల కదలికలను నిరంతరం కనిపెట్టుకుని ఉంటుంది.
ప్రకృతి విపత్తుల్లో అండగా..
కేవలం రక్షణ రంగంలోనే కాదు. ప్రజలకు అవసరమైన సేవలకూ అన్వేష ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. వరదలు, భూకంపాలు, తుపానులు, కార్చిచ్చులు, అడవుల నరికివేత, అక్రమ మైనింగ్, కాలుష్యం అంచనా వేయడానికి, వాటి తీవ్రత గుర్తించి ప్రజలను, ప్రకృతిని కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేశాభివృద్ధిలో, రక్షణలో ఎంతో కీలకమైన ఈ ‘అన్వేష’ శాటిలైట్ సోమవారమే నింగిలోకి వెళ్లనుంది. ఈ క్రమంలో కోట్లాది భారతీయుల నుంచి వినిపిస్తున్న మాట ‘ఆల్ ది బెస్ట్ అన్వేష’.

Read Also: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ : మోడీ
Follow Us On : WhatsApp


