కలం, వెబ్ డెస్క్ : అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారతీయ స్టార్టప్ ఆర్బిట్ ఎయిడ్ (OrbitAID) సిద్ధమైంది. ఉపగ్రహాలకు నింగిలోనే ఇంధనం నింపే ప్రయోగానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇస్రో (ISRO) చేపట్టబోయే పీఎస్ఎల్వీ సీ-62 ప్రయోగం ద్వారా ఆయుల్ శాట్ అనే వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మిషన్ ద్వారా అంతర్గతంగా ఇంధనాన్ని, విద్యుత్తును ఒక చోటు నుండి మరోచోటుకు బదిలీ చేసే సాంకేతికతను పరీక్షించబోతున్నారు.
వచ్చే ఏడాది నాటికి రెండు ఉపగ్రహాల మధ్య నేరుగా అనుసంధానం ఏర్పరచి, ఇంధనాన్ని విజయవంతంగా బదిలీ చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రైవేటు సంస్థ కూడా ఇటువంటి ఘనతను సాధించకపోవడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో అంతరిక్షంలో ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, కాలం చెల్లిన ఉపగ్రహాల పనితీరును మెరుగుపరచడానికి మార్గం సుగమం అవుతుంది.
ఈ మొత్తం ప్రక్రియలో ఎస్ఐడిఆర్పి అనే ప్రత్యేకమైన డోకింగ్ పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని సాయంతోనే ట్యాంకర్ వ్యోమనౌకను మరో ఉపగ్రహంతో అనుసంధానించి ఇంధనాన్ని నింపుతారు. తాజా ప్రయోగంతో ఈ సాంకేతికత అత్యున్నత స్థాయి టీఆర్ఎల్-9 స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే ఈ అద్భుతమైన సాంకేతికత కోసం యూరప్‌కు చెందిన పలు సంస్థలు ఆర్బిట్ ఎయిడ్ (OrbitAID) కంపెనీకి ఆర్డర్లు ఇవ్వడం విశేషం. మన దేశీయ స్టార్టప్ సాధించబోతున్న ఈ విజయం అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తిని మరో స్థాయికి తీసుకెళ్లనుంది.
Read Also: అజిత్ దోవల్ అసలు ఫోన్ వాడరట!
Follow Us On: X(Twitter)


