కలం డెస్క్ : తెలంగాణ మంత్రుల్లో (Telangana Ministers) అసంతృప్తి నెలకొన్నదా?.. ముఖ్యమంత్రితోనూ గ్యాప్ ఏర్పడిందా?.. వారి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయా?… మంత్రులకు తెలియకుండానే ఉత్తర్వులు వెలువడుతున్నాయా?.. ఇలాంటి పలు సందేహాలకు ఇటీవల జరిగిన పరిణామాలు అద్దం పడుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రి తానే అయినా కొత్త చిత్రాల టికెట్ ధరల పెంపు విషయంలో తనకు తెలియకుండానే ఉత్తర్వులు వెలువడ్డాయని స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకున్నారు. ఇదే తరహాలో గతంలో కొన్ని ఉత్తర్వులు ఆయా శాఖల మంత్రులకు తెలియకుండానే రిలీజ్ అయ్యాయి. గత ప్రభుత్వంలో మంత్రులే లేకుండా కేసీఆర్ రివ్యూలు చేసి నిర్ణయాలు తీసుకునేవారని, ఇప్పుడు మంత్రులకు తెలియకుండానే ఉత్తర్వులు విడుదలవుతున్నాయని సచివాలయం అధికారులు గుసగుసలాడుకున్నారు.
కొత్త చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు :
కొత్త సినిమాలు విడుదలయ్యే సందర్భంగా థియేటర్లలో టికెట్ రేట్లను పెంచుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయా నిర్మాణ సంస్థలు ప్రభుత్వాన్ని కోరడమే తరువాయి ఉత్తర్వులు వెలువడేవి. చివరకు కోర్టుల దాకా వెళ్ళి ప్రభుత్వ నిర్ణయం రివర్స్ అయ్యేది. తాజాగా ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం విషయంలో అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం చిరంజీవి సినిమా విషయంలో మాత్రం రెండు రోజుల ముందే ఇచ్చిందనే అంశం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది. ఇదే విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ శాఖ మంత్రి తానే అయినా తనకు సంబంధం లేకుండానే ఉత్తర్వులు వచ్చేస్తున్నాయన్నారు. హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఇకపై కొత్త చిత్రాలకు టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే ఉండదని చెప్పినా మెమో రూపంలో నిర్ణయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.
చెక్‌పోస్టుల విషయంలోనూ అదే తీరు :
రవాణాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దులో నడిచే చెక్‌పోస్టులను అర్ధంతరంగా ఎత్తివేసే విషయంలో ఆ శాఖ మంత్రికి కూడా తెలియలేదన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఉత్తర్వులు విడుదలయ్యేంతవరకూ మంత్రికి తెలియకపోవడం చర్చకు దారితీసింది. ఇదే అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించేసరికి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ ఉత్తర్వులను సమర్ధించుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు అమల్లోకి తెచ్చామని సర్దిచెప్పుకున్నారు. దానికి ముందు ఎక్సయిజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కొన్ని కంపెనీల లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో అనుమతి విషయంలో కూడా వివాదం చెలరేగింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సయిజ్ శాఖ మధ్య సమన్వయం లేదని, ఎవరి ఒత్తిళ్ళ కారణంగా ఈ నిర్ణయం జరిగిందనేది చర్చకు దారితీసింది. ఎట్టకేలకు ఆ శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చుకోక తప్పలేదు.
‘హిల్ట్’ పాలసీ టు గ్లోబల్ సమ్మిట్ :
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ విషయంలో సైతం వివాదం చోటుచేసుకున్నది. అధికారికంగా పాలసీ విడుదల కాకముందే ప్రతిపక్షాలకు లీక్ కావడం వివాదానికి దారితీసింది. అధికారులను అనుమానించే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వమే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం తీసుకుని విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించక తప్పలేదు. ఇద్దరు ఐఏఎస్‌లు, మరో ఇద్దరు గ్రూప్-1 అధికారులు బాధ్యులంటూ సచివాలయ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. పాలసీ లీకేజీ వివాదం ఇలా ఉంటే, రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగినా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఆ శాఖ మంత్రికి వేదికపై చోటు దక్కలేదని, ఆ శాఖ అధికారి విషయంలో తలెత్తిన భేదాభిప్రాయం చివరకు సీఎంకు, మంత్రికి మధ్య గ్యాప్‌కు కారణమైందన్న ఓపెన్ కామెంట్లు వినిపించాయి.
కాంట్రొవర్సీలో ఇరిగేషన్ పీపీటీ లైవ్ :
కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వివాదాస్పదమైంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు. దీన్ని గణాంకాలు, ఆధారాలతో సహా ఎమ్మెల్యేలకు వివరిద్దామనుకున్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంలో ఈ అవగాహన ఉపయుక్తంగా ఉంటుందని భావించారు. ఎమ్మెల్యేలకు అవగాహన కలిగించేలా ప్రజాభవన్ వేదికగా పీపీటీ ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు సిద్ధమైనా అధికారులు అర్ధంతరంగా నిలిపివేశారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకే ఆగిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో మంత్రికి, సీఎంకు మధ్య వాదన జరిగిందని ఇరిగేషన్ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం జోక్యంతో కీ ఎవరి చేతుల్లో ఉన్నదనే కామెంట్లు వినిపించాయి.
నా శాఖకే నేను పరిమితమన్న మంత్రి :
ఒక్కో మంత్రికి ఒక్కో తరహా అసంతృప్తి నెలకొన్న సమయంలో రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి తానే అయినా మేడారం జాతర పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూసుకుంటున్నారని అన్నారు. “నేను నా శాఖల పనులకే పరిమితం అవుతున్నా..” అని వ్యాఖ్యానించారు. రెండేండ్ల క్రితం మేడారం జాతర పనులు, ఏర్పాట్ల విషయంలో మంత్రి సీతక్కతో విభేదాలు వచ్చాయని, బహిరంగంగా కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రైతు రుణమాఫీ విషయంలోనూ గతేడాది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన గణాంకాలకు, ప్రభుత్వం వెల్లడించిన లెక్కలకు మధ్య తేడా ఉండడంతో సమన్వయం కొరవడిందనే విమర్శలు వచ్చాయి. మంత్రులకు (Telangana Ministers) తెలియకుండా నిర్ణయాలు జరగడం, ఉత్తర్వులు విడుదల కావడం చివరకు ఆయా శాఖల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారన్న ముద్ర పడేందుకు దారితీసింది.

Read Also: అజిత్ దోవల్ అసలు ఫోన్ వాడరట!
Follow Us On : WhatsApp


