epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సెన్సార్ బోర్డుకు రాజకీయ మకిలి ! ఎందుకిలా?

కలం డెస్క్: కోలీవుడ్ దళపతి, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమా విషయంలో సెన్సార్ బోర్డు తీరు తీవ్ర దుమారం రేపుతున్నది. రాజకీయ మలుపులు తిరుగుతున్నది. బోర్డుపై సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు భగ్గుమంటున్నారు. ఈ నెల 9న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటికే విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నది. సీబీఎఫ్ సీ (CBFC) వ్యవహారాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్తోపాటు సినీ ప్రముఖులు రాంగోపాల్ వర్మ, కమల్ హాసన్ వంటి వారు తప్పుబట్టారు. రాజకీయాలకు కేంద్రంగా సీబీఎఫ్ సీ మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎందుకు ఇవ్వలే?

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనుకుంటున్నారు టీవీకే చీఫ్ విజయ్ ! రెండేండ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు ‘జన నాయగన్’ (Jana Nayagan) చివరి చిత్రమన్న ప్రచారం జరుగుతున్నది. ఆ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తెలుగులో ‘జన నాయకుడు’గా విడుదలకానుంది. సినిమాను సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిరుడు డిసెంబర్లోనే సీబీఎఫ్ సీకి.. నిర్మాణ సంస్థ కేవీఎన్  పంపింది. మూవీలో కత్తెర పెట్టాల్సిన సన్నివేశాలు 27 వరకు ఉన్నాయని మొదట సెన్సార్ బోర్డు తెలిపింది.

ఆ మేరకు సన్నివేశాలను తొలగించి.. తిరిగి బోర్డుకు కేవీఎన్ సమర్పించింది. అయినప్పటికీ ఇంకా సమీక్షించాల్సి ఉందని చెప్పి.. రివ్యూ కమిటీకి బోర్డు సిఫార్సు చేసింది. అప్పటికే సినిమా డేట్ ను (జనవరి 9) ఫిక్స్ చేసుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్.. సర్టిఫికెట్ వస్తే గానీ విడుదల చేసే పరిస్థితి లేక సంశయంలో పడింది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఆపాటికే దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. సర్టిఫికెట్ రాక సినిమా విడుదల వాయిదా పడటంతో.. టికెట్లకు నిర్మాతలు రీఫండ్ చేయాల్సిన పరిస్థితి. దీంతో సినీ ఇండస్ట్రీకి భారీగా నష్టం వాటిల్లుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనని సీబీఎఫ్ సీకి ఆదేశాలు జారీ చేసింది. బోర్డులోని ఒక్క సభ్యుడు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఎగ్జామినేషన్ కు ఎందుకు పంపాల్సి వచ్చిందని మండిపడింది. జన నాయగన్ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనన్న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసేందుకు సీబీఎఫ్ సీ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వెనుక కూడా ఇదే కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సెన్సార్ బోర్డుపై రాజకీయ ఆరోపణలు రావడం ఇదేం కొత్తకాదు.

ఆ లిస్ట్ లో సెన్సార్ బోర్డునూ చేర్చారు: స్టాలిన్

సీబీఎఫ్ సీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ కి మద్దతు లభిస్తున్నది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్  స్పందిస్తూ.. ‘‘సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు వాడుకుంటున్నది. ఇప్పుడు ఆ జాబితాలో సీబీఎఫ్ సీ ని కూడా చేర్చింది. ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తూ సహించేది లేదు” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్ కి సినిమా విషయంలో అండగా ఉంటున్నట్లు ప్రకటించింది. రాజకీయాల కోసం అన్ని సంస్థలను బీజేపీ వాడుకుంటున్నదని మండిపడింది.

సెన్సార్ బోర్డు అవసరమా?: ఆర్జీవీ

తొమ్మిదేండ్ల పిల్లోడికి కూడా హార్డ్ కోర్ పోర్న్ వీడియోలు అందుబాటులో ఉంటున్న ఇలాంటి కాలంలో సెన్సార్ బోర్డు అవసరం ఏమిటని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో సెటైర్ వేశారు. ‘‘ఇది జన నాయగన్ (Jana Nayagan) సినిమాకు సంబంధించిన సెన్సార్ విషయం మాత్రమే కాదు. మొత్తం వ్యవస్థకు సంబంధించింది. ఎలాంటి సెన్సార్ లేకుండా ఓటీటీల్లో, యూ ట్యూబ్ లో కుప్పలు తెప్పలుగా కంటెంట్ వచ్చేస్తున్నది. ఫోన్ ఓపెన్ చేయగానే అంతా కనిపిస్తున్నది. వీటిని ఆపే గేట్ కీపర్ ఎవరు? అరచేతిలో అరాచకం ఉన్నప్పుడు సినిమాలకే ఎందుకు కత్తెరలు? సెన్సార్ బోర్డు అవసరమా? బోర్డుది నైతికత కాదు.. ద్వంద్వ విధానం” అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

ఆర్ట్, ఆర్టిస్టులకు విలువేది?: కమల్ హాసన్

ప్రజాస్వామ్యంలో కళలకు, కళాకారులకు విలువలేకుండా పోతున్నదని సీబీఎఫ్ సీ తీరుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సినిమా అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు.. అది ఎందరో కష్టపడితే వచ్చింది. దాని విషయంలో రాజకీయాలు ఏమిటి? కటింగ్స్ విషయంలో ఏదైనా ఉంటే రాతపూర్వకంగా సూచించాలి. కానీ, అడ్డుకోవడం ఏమిటి? కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది” అని సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు.

బోర్డు తన డ్యూటీ తాను చేస్తున్నది: శరత్ కుమార్

కోలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శరత్ కుమార్ (R. Sarath kumar) మాత్రం సెన్సార్ బోర్డు విషయంలోకి రాజకీయాలను తీసుకురావొద్దని సూచించారు. బోర్డు తన డ్యూటీ తాను చేస్తున్నదని.. అంతెందుకు తాను నటించిన అడంగత్తె (Adangathey) కొన్నేండ్ల పాటు సర్టిఫికెట్ రాక ఆగిపోయిందని గుర్తుచేసుకున్నారు. ప్రతి విషయంలో రాజకీయాలను చొప్పించడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్ అక్కినేని

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>