కలం, వెబ్ డెస్క్ : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపిందని, అయితే ఈ ప్రాంతం తిరిగి కరీంనగర్ జిల్లాలోనే ఉండాలన్నది ఇక్కడి ప్రజల బలమైన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ప్రజలకు ఒక హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ప్రజల అభీష్టం మేరకు ఈ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అప్పట్లోనే ప్రకటించారని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు.
రాష్ట్రంలో ఎప్పుడైనా జిల్లాల సరిహద్దుల మార్పు, శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టినప్పుడు, హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.
Read Also: మెట్రో ఫేజ్ 2కు సహకరించండి: కేంద్రానికి భట్టి విజ్ఞప్తి
Follow Us On : WhatsApp


