కలం, వెబ్ డెస్క్: అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా (Amberpet SI) విధులు నిర్వహించిన భానుప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్ లకు బానిసై.. డబ్బు కోసం పోలీసులు రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టినట్టు భాను ప్రకాశ్ మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భాను ప్రకాశ్‌ను అదుపులో తీసుకున్నారు. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. గత ఏడాది నవంబర్ నెలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రికవరీ కేసుల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారికంగా స్టేషన్‌కు అప్పగించకుండా, వ్యక్తిగత అవసరాల కోసం తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో భానుప్రకాష్ రెడ్డి బెట్టింగ్ యాప్‌లకు బానిసగా మారి భారీగా అప్పులు చేసినట్టు, ఆ అప్పులు తీర్చేందుకే రికవరీ సొమ్మును దుర్వినియోగం చేసినట్టు తేలింది.
తప్పును అంగీకరించిన ఎస్సై
విచారణ సందర్భంగా తన తప్పును భానుప్రకాష్ రెడ్డి (Amberpet SI Bhanu Prakash) అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు, తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో పోయిందని ఆయన చెప్పడంతో, ఆ అంశంపైనా అధికారులు మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు. సర్వీస్ ఆయుధం అదృశ్యం కావడం తీవ్ర అంశంగా భావించిన ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో తనకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 ఉద్యోగం వచ్చిందని, అక్కడికి బదిలీ చేయాలని కోరుతూ భానుప్రకాష్ రెడ్డి దరఖాస్తు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో సేకరించిన ఆధారాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలుకు పంపినట్టు అధికారులు వెల్లడించారు.
Read Also: మహిళా ఐఏఎస్‌పై ఆరోపణలను ఖండించిన ఐపీఎస్ అసోసియేషన్
Follow Us On: Pinterest


