కలం డెస్క్: కలగా మిగిలిపోయిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ (Nizam Sugar Factory) రీ-ఓపెనింగ్‌కు అడుగులు పడుతున్నాయా?.. ఇటీవల శాసన మండలి వేదికగా కవిత ఈ అంశాన్ని లేవనెత్తడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందా?.. ఒక్క దెబ్బతో ఇటు బీఆర్ఎస్‌ను, అటు బీజేపీని, ఇంకో వైపు నిజామాబాద్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు చెక్ పెట్టాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదా?… దీనికి అధికారుల నుంచి ‘ఔను’ అనే సమాధానాలే వస్తున్నాయి. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తున్నామని, అందుకోసం నిధులను కేటాయిస్తున్నామని స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశమున్నది. ఇందుకోసం పరిశ్రమల శాఖ తయారుచేసిన ప్రతిపాదనల్లో కేటాయింపులు అంచనాను సిద్ధం చేసింది.
ఫ్యాక్టరీ రీ-ఓపెనింగ్‌కు రూ. 16 వేల కోట్లు :
రానున్న ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. ఎంత బడ్జెట్ అవసరమో ఆయా శాఖలు లెక్కలు వేసుకున్నాయి. ప్రతిపాదనల రూపంలో ఆర్థిక శాఖకు పంపుతున్నాయి. డిపార్టుమెంట్ల నుంచి ప్రతిపాదనలు అందగానే శాఖల వారీగా మంత్రులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ తయారుచేసిన ప్రపోజల్స్ నోట్‌లో ‘షుగర్ ఇండస్ట్రీస్ కోసం రూ. 16 వేల కోట్లను ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన వెనక నిజామాబాద్ జిల్లాలోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీని రీ-ఓపెన్ చేయించే ఉద్దేశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. పరిశ్రమల శాఖకు అవసరమయ్యే కేటాయింపులతో జోడించకుండా షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని విడిగా పేర్కొనడం గమనార్హం.
రీ-ఓపెనింగ్‌తో పొలిటికల్ మైలేజ్ :
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం వెనక ప్రభుత్వానికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. పొలిటికల్‌గా కాంగ్రెస్‌కు మైలేజ్ వస్తుందని అంచనా. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చినా పదేండ్లలో సీఎంగా ఉండి కూడా విఫలమయ్యారని ప్రచారం చేసుకోడానికి కాంగ్రెస్‌కు అవకాశం చిక్కుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆ జిల్లాలో బలహీనం కావడానికి మార్గం సుగమమవుతుంది. ఈ జిల్లాలోని మొత్తం తొమ్మిది స్థానాల్లో రెండు చోట్ల బీఆర్ఎస్, మూడు చోట్ల బీజేపీ, నాలుగుచోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ బలాన్ని తగ్గించవచ్చన్నది కూడా మరో వాదన. ఈ ఫ్యాక్టరీని రీ-ఓపెన్ చేయడం ద్వారా కాంగ్రెస్‌కు మైలేజ్ రావడంతో పాటు మిగిలిన మూడు పార్టీలను ఇరుకున పెట్టవచ్చన్నది ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తున్నది. పైగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా రాహుల్‌గాంధీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ రీ-ఓపెనింగ్‌పై హామీ ఇచ్చారు. గతేడాది కమిటీతో అధ్యయనం చేయించిన రాష్ట్ర సర్కార్ ఈసారి బడ్జెట్‌లో నిధులిచ్చి తెరిపించడానికి కసరత్తు చేస్తున్నది.
కవితకు అస్త్రం లేకుండా చేసేలా.. :
షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటామని ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాతా కేసీఆర్ (KCR) హామీ ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత (Kalvakuntla Kavitha) ఓడిపోవడానికి ఈ ఇష్యూ కూడా ఓ కారణమనే వాదన వినిపించింది. ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం వినిపించుకోలేదని ఇటీవల కౌన్సిల్‌లోనూ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు రైతుల తరఫున పోరాటం చేస్తానని ప్రకటించారు. ఫస్ట్ టైమ్ ఎంపీగా అవకాశం ఇచ్చిన, మెట్టినిల్లైన నిజామాబాద్ నుంచే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని ఆమె భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ప్రత్యేక దృష్టి సారించి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని (Nizam Sugar Factory) ఒక ప్రచారాస్త్రంగా ఎంచుకోకుండా చేయవచ్చన్నది సర్కార్ మరో ప్లాన్. నిజాం సర్కార్ 1938లో బోధన్ (Bodhan) కేంద్రంగా ఈ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఆసియాలోనే అతిపెద్ద షుగర్స్ ఫ్యాక్టరీగా గుర్తింపు ఉన్నది. వేలాదిమందికి ఉపాధినిచ్చింది. చెరుకు రైతులకు వరప్రదాయినిగా మారింది. నష్టాల పేరుతో 2015 డిసెంబర్‌లో యాజమాన్యం ‘లే ఆఫ్’ ప్రకటించింది. కార్మికులు రోడ్డున పడ్డారు. తిరిగి తెరిపించాలని ఎన్నో ఏండ్లుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రీ-ఓపెనింగ్‌కు రంగం సిద్ధమవుతున్నది.
Read Also: ప్రైవేటు భవనాల్లో ఆఫీసులు కుదరవ్
Follow Us On: Sharechat


