కలం డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం 117 మున్సిపాలిటీలకు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు (Corporation Elections) నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. జీహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి చివరి వరకూ ఉన్నందున ఆ తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి. ఇటీవల జీహెచ్ఎంసీలో కలిసిన ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు సైతం అప్పుడే జరుగుతాయి. మిగిలిపోయిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు ఇప్పుడే పెట్టేద్దామా?.. లేక జీహెచ్ఎంసీతో పాటు పెడదామా?.. ఇదీ ఇప్పుడు ప్రభుత్వం మదిలో ఉన్న ఆలోచన. ఈ రెండు కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్‌తో ముగుస్తున్నా వాటిని రద్దు చేయడంలోని లీగల్ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. రద్దు చేస్తే వచ్చే సమస్యలేంటి?.. తక్కువ సమయంలో ఓటర్ల జాబితా రెడీ అవుతుందా?.. జీహెచ్ఎంసీతో నిర్వహిస్తే ఎలా ఉంటుంది?.. ఇలాంటివాటిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారని సచివాలయ వర్గాల సమాచారం.
ఫిబ్రవరిలో నిర్వహించడం సాధ్యమేనా? :
ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను (Corporation Elections) కూడా మిగతా కార్పొరేషన్లతో పాటే ఫిబ్రవరిలో నిర్వహించాలని ఆయా కార్పొరేషన్ల పాలకవర్గాలు కోరుకుంటున్నాయి. అలా నిర్వహించాలంటే పాలకవర్గాలను రద్దు చేయక తప్పదు. ఇందుకు అక్కడి మిగతా పార్టీల కార్పొరేటర్ల నుంచి సహకారం ఉంటుందా?.. రద్దు చేస్తే వచ్చే న్యాయపరమైన చిక్కులేంటి?.. అధిగమించడానికి ఏం చేయాల్సి ఉంటుంది?.. వీటిపై ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. న్యాయ, మున్సిపల్ శాఖల అధికారుల అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఓటర్ల జాబితా తయారీకి పట్టే సమయం, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడం, తుది జాబితాను రిలీజ్ చేయడం.. ఇవన్నీ పూర్తికావాల్సి ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశాలపైనా ఆరా తీస్తున్నది. పాలకవర్గాలను రద్దు చేయాలంటే ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేయక తప్పదు.
జీహెచ్ఎంసీతో కలిపి ఎన్నికలా?.. :
వాస్తవానికి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ చివరి వరకు ఉంది. మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిపి వీటికి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే.. విడిగా నిర్వహించాల్సి ఉంటుంది. విడిగా నిర్వహించలేని పక్షంలో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీతో పాటు నిర్వహించే అవకాశం ఉంది. న్యాయ, మున్సిపల్ శాఖల నుంచి వచ్చే అభిప్రాయాలు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత, అది నిర్వహించాల్సిన ప్రక్రియ.. వీటన్నింటిపై వచ్చే ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. వీలైనంతవరకు అన్ని ఎన్నికలను ఈ ఏడాది జూన్, జూలైలోగా నిర్వహించి ఇకపైన పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
Read Also: ‘మున్సిపోల్స్’ బీసీ రిజర్వేషన్‌పై ఉత్కంఠ
Follow Us On : WhatsApp


