కలం డెస్క్ : ప్రభుత్వ ఆఫీసులు (Telangana Govt Offices) ఇకపైన ప్రైవేటు భవనాల్లో ఉండడం కుదరదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. నెల 26 తర్వాత వెళ్ళిపోవాల్సిందిగా గత నెలలోనే క్లారిటీ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా రోడ్లు భవనాల శాఖ సైతం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 28 వరకు ప్రైవేటు భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మారిపోవాలని పలు శాఖలకు ఆర్ అండ్ బీ డిపార్టుమెంటు నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ప్రభుత్వ భవనాలు చాలా ఖాళీగానే ఉన్నా ప్రైవేటు బిల్డింగుల్లో కొనసాగుతున్నందున ప్రతి నెలా అద్దెల భారం పడుతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. దీన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టి షిప్టింగ్ నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రతి ఏటా అద్దెల పేరుతో ఖజానా ద్వారా ఎంత ఖర్చవుతున్నదో ఆరా తీసి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి అందులోకి వెళ్ళిపోవడం బెటర్ అని ఆయా ఆఫీసులకు స్పష్టత ఇచ్చింది.
షిప్టింగ్‌తో ఏటా రూ. 800 కోట్లు ఆదా :
ప్రభుత్వ భవనాల్లోకి ఆఫీసుల్ని షిప్ట్ చేయడం ద్వారా ఖజానాకు భారీ ఊరట లభించనున్నది. సుమారు రూ. 800 కోట్ల ఖర్చును తగ్గించుకోవచ్చన్నది రోడ్లు భవనాల శాఖ అంచనా. హైదరాబాద్ నగరంలోనే ప్రస్తుతం అరవైకి పైగా ప్రభుత్వ ఆఫీసులు (Telangana Govt Offices) అద్దె భవనాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించింది. ఇందులో ప్రభుత్వ శాఖలు రూ. 450 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థలైన వివిధ కార్పొరేషన్లు, అనుబంధ విభాగాలు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. రాష్ట్ర ఏర్పడిన తర్వాత గడచిన పన్నెండేండ్లలో ఈ ఖర్చు సుమారు రూ. 9,600 కోట్లు అయింది. ఖజానాపై భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి?.. ప్రైవేటు భవనాల నుంచి తరలిస్తే సరిపోయే స్థలమున్నదా?.. షిప్టింగ్‌కు ఎంత సమయం పడుతుంది?.. రినోవేషన్‌కు ఎంత ఖర్చవుతుంది?.. ఇలాంటి అంశాలపై స్టడీ జరుగతున్నది.
మార్చి 31 తర్వాత అద్దెలు బంద్ :
“ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా షిప్టింగ్ ప్రక్రియ ఈ నెల చివరికల్లా పూర్తికావాలి… అవసరమైన రెనోవేషన్ పనులు వచ్చే నెలకల్లా కంప్లీట్ చేసుకోవాలి… ప్రైవేటు భవనాలతో అగ్రిమెంట్లన్నీ మార్చి 31వ తేదీ లోగా క్లోజ్ కావాలి.. ఏప్రిల్ నెల నుంచి అద్దెల పేరుతో నిధుల కేటాయింపు కుదరదు… అలాంటి ప్రపోజల్సే రావద్దు.. ఎన్ని సమస్యలున్నా ప్రభుత్వ బిల్డింగుల్లోనే సెట్ చేసుకోవాలి…” అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్ అండ్ బీ శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాల్లో సుమారు 4 లక్షల చ.అ. స్థలం ఉన్నట్లు వివరించారు. హిమాయత్‌నగర్, నాంపల్లి, అమీర్‌పేట్, హైటెక్స్ (HITEX/NAC), టీ-హబ్ (T-Hub) తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భవనాల్లో తగిన స్థలం ఉన్నదని, జనవరి 28లోగా శాఖలు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తుచేశారు.
Read Also: సార్లూ.. జర మా భాష నేర్చుకోండి!
Follow Us On: X(Twitter)


