కలం, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్ లో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అలజడి మొదలైంది. బీఆర్‌ఎస్ పాల్వంచ పట్టణ సీనియర్ నాయకుడు భూక్యా చందు నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కొడుకు రాఘవేంద్రరావు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ చందు నాయక్ ఆరోపించాడు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన తనను రాఘవేంద్రరావు ఇంటికి పిలిపించి కులం పేరుతో అవమానించి.. బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదని.. గతంలో ఇతర నాయకుల వద్ద పనిచేశావని రాఘవేంద్రరావు అవమానించాడని చందునాయక్ చెప్పుకొచ్చాడు. తనను వనమా వర్గీయులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని త్వరలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చందు నాయక్ తెలిపారు.


