కలం, నిజామాబాద్ బ్యూరో : కవిత రాజకీయ పార్టీ వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని.. ఆయనే ఫండింగ్ చేస్తున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) ఆరోపించారు. కవిత సొంత డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. నిజమాబాద్ లో మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ‘వీబీ జీ రాంజీ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ ను ఆ రాముడే కాపాడాలి. ఉపాధి హమీ చట్టం లోపాలను సరిదిద్ది కేంద్రం సమూల మార్పులు చేసింది. జీ రాం జీ అని పేరు పెడితే ప్రతిపక్షాలకు, తెలంగాణలో కాంగ్రెస్ కు ఇబ్బందేంటి. సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించాల్సింది పోయి కేంద్రంతో యుద్ధం చేస్తామనడం హాస్యస్పదం. 100 రోజులు కాకుండా పేదలకు 150 రోజులు ఉపాధి కల్పిస్తున్నాం. జీరాంజీ పథకం ద్వారా పేదలకు ఉపాధితో పాటు డబ్బులు వారి ఖాతాలో పడటం కాంగ్రెస్ కు ఇష్టం లేదని’ ఎంపీ అరవింద్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి కేంద్రంతో యుద్ధం చేస్తానంటే అయన నాశనం కొని తెచ్చకున్నట్టే అని ఎంపీ అరవింద్ (Dharmapuri Arvind) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నాడని.. ప్రభుత్వ నిధులు తినేసి డబ్బులు లేవని మొత్తుకుంటే ఎలా అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వట్లేదనే సాకులు చెప్పే ముందు ఖర్చుల లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి, ఆక్రమాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు.


