కలం, నల్లగొండ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరహాలో తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీసీలకు రక్షణ చట్టం బీసీ అట్రాసిటీ (BC Atrocity Act) రూపొందించి అమలుచేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ యూత్ జేఏసీ చైర్మన్ కట్టెకోలు దీపేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ యువజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని బీసీ కులాలను కులాల పేరుతో దూషిస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో కొన్ని కులాలను గ్రామ బహిష్కరణ చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బీసీల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరహాలో తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించి బీసీ అట్రాసిటీ చట్టాన్ని (BC Atrocity Act) తీసుకువచ్చి అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పాల్వాయి రవి, కొడదల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: పది నిమిషాల్లోనే సమ్మక్క సారలమ్మ దర్శనం
Follow Us on: Twitter


