కలం, వెబ్డెస్క్: తెలంగాణకు పొరుగు రాష్ట్రాలతో పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని కోరుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. జలాలపై వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలంటానన్నారు. నీటి గొడవల ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు. పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా పార్టీలు సహకరించాలని కోరారు. రావిర్యాల ఈ–సిటీలో శుక్రవారం సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రాలతో ఎదురవుతున్న నీటి వివాదాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవిష్యత్తు గొడవల్లో కాదు, గ్లోబల్ పోటీలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాలతో వివాదాలు కాదు, పరస్పర సహకారమే తమ విధానమని ఆయన స్పష్టంగా చెప్పారు. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా – అందరితో చర్చలు జరుపుతూ వివాదాల పరిష్కారంలో ముందుకు వెళ్లేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ వంటి కీలక అంశాల్లో పొరుగు రాష్ట్రాల సహకారం తప్పనిసరి అని గుర్తుచేశారు. అందుకే సమస్యల పరిష్కారం కోసం సామరస్యపూర్వక చర్చలు జరుగుతాయన్నారు. ప్రజా ప్రయోజనాలు, రైతుల హితమే తమ ఏకైక లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా.. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఎం రేవంత్ కోరారు. అనుమతులు నిలిచిపోవడంతో కేంద్ర నిధులు రావడం లేదని, దాంతోతెలంగాణపై అదనపు ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ‘మేం వివాదం కోరుకోవడంలేదు.. పరిష్కారం కోరుకుంటున్నాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Read Also: రేవంత్ రెడ్డికి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా? : హరీష్ రావు
Follow Us On: Sharechat


