కలం, వెబ్ డెస్క్: ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఎలుకల మందు ఆర్డర్ చేసింది. కానీ డెలివరీ బాయ్ (Delivery Boy) ఆ ఆర్డర్‌ను ఆమెకు ఇవ్వకుండా క్యాన్సిల్ చేశాడు. అతడు చేసిన పనికి నెటిజన్స్ సలాం కొడుతున్నారు. డెలివరీ బాయ్ ఎందుకు హీరో అయ్యాడు? అసలు ఏంజరిగింది? వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి మూడు ఎలుకల మందు ప్యాకెట్లను ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసింది. ఫోన్ కాల్ సమయంలో డెలివరీ బాయ్ ఆ మహిళ ఏడ్వడం స్పష్టంగా విన్నాడు. ‘ఇది ఎలుకలను చంపడానికి కాదు. తాను సుసైడ్ కోసమే ఆర్డర్ చేసింది’ అని గ్రహించాడు.
విషయం తెలుసుకున్న డెలివరీ బాయ్ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఆర్డర్ రాలేదని, ఆత్మహత్య ప్రయత్నం మానుకోవాలని కోరాడు. ఆ మహిళ వినలేదు. నిజంగా ఎలుకల సమస్య ఉంటే, రాత్రి కాకుండా ముందుగానే ఆర్డర్ ఇచ్చేదానివని వాదించాడు. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని డెలివరీ బాయ్ సోషల్ మీడియా (Social Media)లో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మానవత్వం బతికింది, హ్యాట్సాఫ్ బ్రదర్, ఒక ప్రాణాన్ని కాపాడటం అంత తేలికైన విషయం కాదు.. బిగ్ సెల్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


