కలం డెస్క్ : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పూర్తికావడంతో రాష్ట్ర సర్కార్ బడ్జెట్ సెషన్‌పై (Telangana Budget) ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నది. సంక్రాంతి పండుగ పూర్తికాగానే అన్ని శాఖల అధికారులతో ఫైనాన్స్ సెక్రటరీ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా శాఖల తరఫున బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు ఉండాలనే అభిప్రాయాలను, ప్రతిపాదనలను తీసుకోనున్నారు. ఏయే స్కీమ్ కింద ఎంత నిధుల కేటాయింపు చేయాలనేది ఖరారు చేయడానికి ముందు అన్ని శాఖల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఉదాహరణకు ఈసారి పరిశ్రమల శాఖ తరఫున సుమారు రూ. 90 వేల కోట్ల మేర ప్రతిపాదనలు ప్రాథమికంగా తయారయ్యాయి. ఇలాంటి కసరత్తే అన్ని శాఖల్లోనూ జరుగుతున్నది.
నిర్దిష్ట ప్రతిపాదనల్లో శాఖలు బిజీబిజీ :
స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ నిర్వహించనున్న సమావేశానికి ప్రస్తుత స్కీమ్‌లకు ఏ మేరకు అవసరమో, కొత్తగా ఏయే అవసరాలకు ఎంత కావాల్సి ఉంటుందో ఆయా శాఖలు లెక్కలు రెడీ చేసుకుంటున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్న సన్నాహక సమావేశాల నాటికి ఈ లెక్కలు, ప్రతిపాదనలు ఫైనల్ అవుతాయి. గత బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షెడ్యూలు ప్రకటించి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో రోజుకు రెండు చొప్పున పది రోజుల మీటింగులు నిర్వహించారు. మొత్తం 23 శాఖల నుంచి ప్రతిపాదనలు వస్తుండడంతో రోజువారీ షెడ్యూలుతో పాటు సన్నాహక సమావేశాలకూ ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి కూడా ఆ తరహాలోనే వరుస సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అన్ని శాఖలకు ఇప్పటికే సర్క్యులర్ జారీ అయ్యాయి.
కేంద్రం నుంచి వచ్చే కేటాయింపులపై ఫోకస్ :
ప్రతి ఏటా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయని ఆశ పడడం, ఆ తర్వాత నిరుత్సాహపడడం ఒక ఆనవాయితీగానే కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలని రాతపూర్వకంగా అంశాలవారీగా కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తుంది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జరిగే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరై ప్రపోజల్స్ ను కేంధ్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణకు ఏ మేరకు నిధులు వచ్చిందీ స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో (Telangana Budget) కేంద్రం నుంచి వచ్చే అంశాన్ని ప్రస్తావించి ఫైనాన్స్ డిపార్టుమెంటు నిర్దిష్ట కేటాయింపులను ఫైనల్ చేస్తుంది.
Read Also: సంక్రాంతికి ముందే క్యాబినెట్ భేటీ ?
Follow Us On: X(Twitter)


