కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో అనుభవమున్న గ్రూప్-1 అధికారులతో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఆ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల్లో అనుభవం ఉన్న గ్రూప్-1 ఆఫీసర్లను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లుగా నియమించాలని కోరారు. పాలనలో అనుభవం కలిగిన సీనియర్ గ్రూప్-1 అధికారులను వివిధ కార్పొరేషన్లకు ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై వివరించిన గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ బృందంలో అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్, పలువురు గ్రూప్-1 అధికారులు ఉన్నారు.
తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసె ఏర్పాటుపై 2015లోనే ఈ విషయంపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటైందని, ఇప్పటికీ ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదికనే ఇవ్వలేదని సభ్యులు వివరించారు. గ్రూప్-1 పోస్టులన్నింటినీ స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రూప్-1 అధికారులతో మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారని అసోసియేషన్ సభ్యులు వివరించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి, అరవింద్ రెడ్డి, నూతనకంటి వెంకట్, పద్మావతి, భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్. సోమ శేఖర్ తదితరులు ఉన్నారు.


