మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగం నడుస్తోంది: పుట్ట మధూకర్‌

కలం, కరీంనగర్‌ : మంథని నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ (Putta Madhukar) విమర్శించారు. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ భవనాలకు వ్యక్తిగత పేర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మంథని పట్టణంలోని సంగీత, నృత్య కళాశాల భవనాన్ని సందర్శించిన ఆయన, ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు మాత్రమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. సంగీత, నృత్య కళాశాల భవనం దుద్దిళ్ల కుటుంబం సొంత నిధులతో నిర్మించింది కాదని, ప్రజలు చెల్లించిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రజాప్రతినిధులందరికీ ప్రోటోకాల్‌ ప్రకారం గుర్తింపు ఇవ్వాలని అన్నారు.

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పందించిన తర్వాత రాత్రికి రాత్రే మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. భవనం ముందు ఉన్న పాత శిలాఫలకాన్ని తొలగించకుండా కొత్తగా ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన సత్యభామ, చంద్రకళ పేర్లను పక్కనపెట్టి ఎమ్మెల్యే పేరు మాత్రమే ప్రాధాన్యత పొందడంపై అభ్యంతరం తెలిపారు.

మంథని చరిత్ర, స్థానికుల సేవలను విస్మరించవద్దని, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు కూడా తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ అంశంపై స్పందించాలని పిలుపునిచ్చారు. వెంటనే వివాదాస్పద శిలాఫలకాన్ని తొలగించి, నిబంధనలు, ప్రోటోకాల్‌ ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లతో ఏర్పాటు చేయాలని పుట్ట మధూకర్‌ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>